యాదాద్రి, జనవరి 9 : తల్లిదండ్రులు కోల్పోయి చదువుకు దూరమైన విద్యార్థినికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. ఆమె చదువుకు కావాల్సిన ఫీజు చెల్లించి అండగా నిలిచారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మోటకొండూర్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఆశ వర్కర్ సబిత చిన్న కూతురు హారిక ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ మొదటి సంవ్సతరం చదువుతున్నది. ఆరేళ్ల క్రితం తండ్రి, ఇటీవల తల్లి సబిత మృతితో ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక చదువు ఆపేసింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గతంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని హామీనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఘట్కేసర్లోని మదర్ థెరిస్సా కళాశాల యాజమాన్యానికి హారికకు సంబంధించిన రూ.43,500 ఫీజు చెల్లించి రసీదును కొండాపూర్‌లో విద్యార్థిని హారికకు ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయి ఆడబిడ్డలు రోడ్డున పడటం కలిచివేసిందన్నారు. మృతురాలు సబిత ఆశ వర్కర్‌గా కొండాపూర్ గ్రామంలో చేసిన సేవలను గమనించామన్నారు. మృతురాలి పెద్దమ్మాయి రేఖ సైతం ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ చదువుకుంటుందని, కళాశాల యాజమాన్యంతో మాట్లాడానని తెలిపారు. అనాథలైన అమ్మాయిల ఫీజు మినహాయించాలని కోరగా యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. అనాథలైన చిన్నారులు చదువుకునేందుకు కావాల్సిన ఖర్చును తామే భరిస్తామన్నారు.
‘రైతుబంధు’ వారోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్
రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా కొండాపూర్‌లో జరిగిన ముగ్గుల పోటీలు, ర్యాలీలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు. గ్రామగ్రామాన రైతుబంధు వారోత్సవాలు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, మోటకొండూర్ జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ భూమండ్ల అయిలయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు నర్సింహులుయాదవ్, రైతుబంధు సమితి మండల డైరక్టర్ సింగిరెడ్డి నర్సిరెడ్డి, పాల సంఘం చైర్మన్ కొల్లూరి మల్లేశ్మిత్ర, కొండాపూర్ సర్పంచ్ మాధవి, వార్డు సభ్యుడు రమేశ్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.