హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కాంగ్రెస్ పాలనలో నిరాశే మిగులుతున్నది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా నేరుగా జీతాలు వేస్తామన్న ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, నేరుగా ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. కొన్ని పత్రికలు ఆ లీకుల వార్తను పతాక శీర్షికన ప్రచురించాయి. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సుమారు ఐదు లక్షల మంది ఉద్యోగుల ఓట్లు కొల్లగొట్టేందుకే సర్కార్ ఆశచూపి, కాలయాపన చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సమాన పనికి సమాన వేతనం కాగితాలకేనా?
రాష్ట్రంలోని 42 ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సుమారు ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నడవడంతో వీరంతా కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ, వీరి పాలిట ఏజెన్సీల వ్యవస్థ శాపంగా మారింది. ఏజెన్సీలు ఉద్యోగుల పీఎఫ్ వాటాలను స్వాహా చేస్తున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయడంలో ప్రభుత్వం విఫలమైంది. శాశ్వత ఉద్యోగుల మాదిరిగా కోటి రూపాయల బీమా సౌకర్యం వీరికి కల్పించలేదు. ఒకటో తేదీన శాశ్వత ఉద్యోగులకు జీతాలు పడుతున్నా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాలు అందడం లేదు. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఏజెన్సీలను రద్దు చేసి, నేరుగా అకౌంట్లలో జీతాలు వేయాలని తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తూ వస్తున్నది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై నమ్మకం కలగాలంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధికే ప్రకటనా?
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయంపై శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రభుత్వం మీద, యంత్రాంగం మీద విశ్వాసం కలుగుతుంది. లేనిపక్షంలో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రకటనలు చేస్తున్నారనే అనుమానం తలెత్తుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏజెన్సీలను పూర్తిగా రద్దు చేసి నేరుగా ఉద్యోగి ఖాతాలోకి జీతాలు జమ చేసే ప్రక్రియను అమలు చేసి చూపించాలి. 15 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారనే సాకుచూపి, మిగిలిన 4.8 లక్షల మందిని ఇబ్బందులు పెట్టడం తగదు. బడ్జెట్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనతోపాటు ప్రత్యేక నిధులు కేటాయించాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడుతాం.
– పుల్లగుర్ల రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్
వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు
శాఖ పేరు ఉద్యోగుల సంఖ్య