
రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. గత ఏడు విడుతల్లో మొక్కల నాటింపు దిగ్విజయంగా పూర్తిచేసిన ప్రభుత్వం ఎనిమిదో విడుతకు సన్నద్ధమవుతుంది. ఆ మేరకు గ్రామాల్లో నర్సరీల నిర్వహణ పనులు ముమ్మరం చేశారు. పాలకవీడు మండల వ్యాప్తంగా 22 గ్రామ పంచాయతీల్లో 4.46 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలకవీడు మండలంలో 4.46 లక్షల మొక్కల పెంపకమే లక్ష్యంబ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తివిత్తనాలు నాటేందుకు ఏర్పాట్లు బ్యాగుల్లో మట్టి నింపే పనులు పూర్తి మొక్కల పెంపకానికి ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీని ఏర్పాటు చేశారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నీటి సదుపాయం కల్పించారు. ముందు జాగ్రత్తగా ఎండ తీవ్రతను అంచనా వేస్తూ ప్రతి నర్సరీ గ్రీన్ షెడ్ల ఏర్పాటుకు అంచనాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆయా నర్సరీల్లో సంచుల్లో మట్టిని నింపే పనులు దాదాపు పూర్తయి విత్తనాలను విత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నీడనిచ్చే వేప, కానుగ సహా మల్లె, గులాబీ పూల మొక్కలు, నేరేడు, జామ, మామిడి, నిమ్మ, దానిమ్మ పండ్ల మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టారు.
మొక్కల పెంపకానికి ఏర్పాట్లు పూర్తి
మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో మొక్కల పెంపకానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. మొక్కల సంరక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు నీటి సదుపాయం కల్పించాం. ఇప్పటికే సంచుల్లో మట్టిని నింపే పని పూర్తయ్యింది. త్వరలోనే విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
గ్రామాలను హరితవనంగా తీర్చిదిద్దేందుకు చర్యలు
మండలంలోని ప్రతి గ్రామాన్నీ హరితవనంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. ఈ క్రమంలో 22 గ్రామ పంచాయతీల్లో 4.46 లక్షల మొక్కల పెంపకమే లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తి చేశాం. రోజూ రెండు లేదా మూడు గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకం పనులను పర్యవేక్షిస్తున్నాం. వన సేవకులు చిత్తశుద్ధితో మొక్కల పెంపకం చేపట్టాలి.