యాచారం, ఆగస్టు 9 : వర్షాకాలంలో విద్యుత్ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడాలని ఎంపీపీ కొప్పు సుకన్య సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సభ్యులు సకాలంలో రానందున సమావేశం సుమారు గంటపాటు ఆలస్యమైంది. సమావేశంలో వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, తాగునీరు, ఉపాధిహామీతో పాటు పలు అంశాలపై చర్చ కొనసాగింది. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలెదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సభ్యులు కోరారు. సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని గైర్హాజరైన అధికారులకు నోటీసులు అందజేయాలని సభ్యులు సూచించారు. ముఖ్యంగా విద్యుత్ సమస్యలపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సమావేశాలల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని సమావేశంలో తీర్మానించిన సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోయారు. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సర్పంచ్‌లు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ స్తంభాల విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెజాన్ కంపెనీకి వేసే స్తంభాలను గ్రామాల్లో వేయకుండా గ్రామాల వెలుపల నుంచి వేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కోరారు. మిషన్‌భగీరథ పైపులైన్ లీకేజీలను అరికట్టి తాగునీరు వృథా కాకుండా అధికారులు దృష్టి సారించాలని పలువురు సభ్యులు అన్నారు. మండలంలో నెలకొన్న రేషన్‌కార్డుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషిచేయాలన్నారు. ఐకేపీ అధికారుల తీరు ఏమాత్రం బాగలేదని, సీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. నందివనపర్తిలో పందుల బెడద అధికంగా ఉన్నందున గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నట్లు సర్పంచ్ ఉదయశ్రీ సభాదృష్టికి తీసుకువచ్చారు. ఎంపీపీ సుకన్య మాట్లాడుతూ విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా కృషిచేయాలన్నారు. తమ విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నొళ్ల జంగమ్మ, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో మమతబాయ్, తాసిల్దార్ నాగయ్య, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.