నేటి నుంచి వారం పాటు సంబురాలు
ఖాతాల్లోకి రూ.50వేల కోట్లు చేరనున్న సందర్భంగా వేడుకలు
రైతు సంక్షేమ పథకాలపై ఇంటింటా అవగాహన
విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు
రైతువేదికల వద్ద ముగింపు వేడుకలు
ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు
అందరూ భాగస్వాములు కావాలని
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
వరంగల్, జనవరి 2 : అదునుకు ఆసరా అయ్యేలా రైతన్నకు కొండంత ధీమా ఇస్తున్న పథకం రైతుబంధు. వారి కష్టనష్టాలు తెలుసుకోవడమే కాదు.. సంక్షేమ పథకాలతో వారిని అన్ని విధాలా ఆదుకుంటూ నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పెట్టుబడి సాయంతో ఎవుసాన్ని పండుగలా మార్చారు. ఈ నెల 10వ తేదీ నాటికి బ్యాంకు ఖాతాల్లో చేరే రైతుబంధు సాయం రూ.50వేల కోట్లకు చేరనున్న సందర్భంగా వారం పాటు ఘనంగా సంబురాలు నిర్వహించనున్నారు. ఈమేరకు నేటి నుంచి 10వ తేదీ వరకు ఊరూవాడన పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని, ఇందులో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలతో పాటు రైతుసంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించడం, ముగింపు రోజున ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు తీసి రైతువేదికల వద్ద అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించనుండగా స్థానిక ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేయనున్నారు.నేటి నుంచి వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో రైతుబంధు సంబురాలు అంబరాన్నంటనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధుతో పాటు రైతు సంక్షేమ పథకాల విశేషాలను ఇంటింటా వివరించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈమేరకు వారం పాటు రైతుబంధు సంబురాలు నిర్వహించేలా టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమైంది. కొత్త సాగువైపు ఆలోచనలు చేస్తున్న రైతులకు రైతుబంధు సాయం ఎంత అవసరమో శ్రేణులు అవగాహన కల్పించనున్నారు. ఈమేరకు నియోజకవర్గంలో రైతుబంధు లబ్ధిదారుల వివరాలు, వారికి అందిన సాయంతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్ధి, తదితర వివరాలతో ఉండే కరపత్రాలను ఇంటింటికీ చేరవేయనున్నారు. ఈక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ ప్రజలకు చేరేలా బహిరంగ లేఖ విడుదల చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఇంటిముందు ముగ్గులు
రైతుబంధు సంబురాలు సంక్రాంతి సంబురాలను తలపించేలా నిర్వహించనున్నారు. సంబురాల్లో మహిళలను భాగస్వామ్యం చేసేలా ప్రతి ఇంటి ముందు రైతుబంధు ముగ్గులు వేయనున్నారు. పథకం విశిష్టతను అన్ని వర్గాల్లోకి తీసుకుపోయేలా సంబురాలు చేయనున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించనున్నారు. భవిష్యత్ తరానికి రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటుగా రైతు వేదికల ఆవశ్యకతపై భావితరానికి మరింత అవగాహన పెంచేలా వారం రోజుల పాటు సంబురాలు నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పూర్తిచేసి ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చిన విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. భావితరాలకు కేసీఆర్ దూరదృష్టి, దార్శనికతకు వివరించనున్నారు.
ఘనంగా ముగింపు సంబురం
రైతుబంధు ముగింపు సంబురాలు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ అధిష్టానం సూచించింది. ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపులు నిర్వహించి పండుగ వాతావరణం ఉండేలా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయనున్నారు. రైతు వేదికల వద్ద ముగింపు సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించనుండగా, సంబురాలకు స్థానిక ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేయనున్నారు. కరోనా వ్యాపించకుండా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.
ఇత్తనాలు తెచ్చిన..
శాయంపేట, జనవరి 2: ఐదెకరాల భూమిల నా భార్య, నాకు చెరి కొంత ఉన్నది. నా భార్యకు రైతుబంధు పైసలు రూ. పది వేలు పడ్డయ్. పడుడుతోటే ఇత్తనాలు, ఎరువులు తెచ్చిన. ఇయ్యాల పొలంలో మక్క సీడ్ ఏత్తున్న. ఎరువులు సల్లుతున్న. ఆరు ఏండ్లుగా టైంకు పెట్టుబడి పైసలు పడుతానయ్. వర్షాకాలం పత్తి గింజలకు డబ్బులు అక్కరకొచ్చినయ్. అంతకు ముందల రైతుబంధు రాక ముందు శాన తిప్పలయ్యేది. పంటలేసెటప్పుడు పైసలు దొరక్క ఆగమాగంగ తిరిగెటోళ్లం. కరంటు సక్కగ ఉండక పొయ్యేది. నాలుగైదేళ్ల కింద బాయిల నీళ్లు ఎల్లక మొత్తంల పంట ఎయ్యకపొయ్యేది. విత్తనం లేటయ్యేది. గిప్పుడు మంచిగున్నది. ఎస్సారెస్పీ నీళ్లు బగ్గ వత్తునయ్. గిప్పుడు పొద్దున, రాత్రుళ్ల కరంటు ఉంటాంది. రైతుబంధు పైసలు వత్తానయ్. రైతుబీమా ఇచ్చి మంచిగ చేస్తున్నరు కేసీఆర్ సారు. ఎవలు ఎన్ని తీర్ల అన్న రైతులకు అయితే కేసీఆర్ మీద శాన అభిమానం ఉన్నది.
-మోతే కుమారస్వామి, రైతు, శాయంపేట
ఆ పైసల్తొ బోరేపిచ్చిన..
నర్సింహులపేట, జనవరి 2: నాకు మూడెకరాల ఎవుసం భూముంది. కేసీఆర్ సారు మొదట్ల రైతుబంధు కింద రూ. 24 వేలు ఇచ్చిండు. ఇగ నా కొడుకు పేర ఉన్న రెండు ఎకరాలకు రూ. 16 వేలు వచ్చినయ్. మొత్తం రూ. 40 వేలతో బోరేపిచ్చిన. ఐదు ఏకరాల్లో మిరప, పత్తి ఏసిన. రెండో సారి రూ. 50 వేలు వత్తె మిరప ఇత్తనాలు, మందు బత్తాలు కొన్న. మోటర్ తెచ్చుకున్న. పంటలకు ఫుళ్లు నీళ్లున్నయ్. వానకాలంల 1.20 ఎకరాల్లో పత్తి, 1.20 ఎకరాల్లో మిర్చి, రెండెకరాల్ల వరి పండించిన. యాసంగిల వరికి బదులు ఎకరంల జొన్న, ఇంకో ఎకరంల సన్న వడ్లు పెడుతున్న. కేసీఆర్ సార్ పెట్టుబడి పైసలిత్తుండడంతో ఇబ్బందులేం వొత్తలేవు.