షాబాద్, డిసెంబర్ 16 : జాతీయ ఆహారభద్రత చట్టం 2013ను అనుసరించి ఆహారభద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని రంగారెడ్డి జిల్లా డీఆర్డీవో ప్రభాకర్ అన్నారు. గురువారం జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో కలెక్టర్ ఆదేశానుసారం డీఆర్డీవో ఆధ్వర్యంలో కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుపై జిల్లా, మండల స్థాయి సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఆహారభద్రత చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ చట్టం పరిధిలోని వచ్చే అన్ని విభాగాలు చట్టాన్ని అమలు పరుస్తున్న అధికారులు, లబ్ధిదారులు తప్పకుండా పాల్గొనాలని తెలిపారు. అందులో భాగంగా సివిల్ సప్లయి, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ప్రసూతి దవాఖానల్లో కాన్పులైన మహిళలు, గ్రామాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్‌కార్డు ద్వారా సరుకులు సక్రమంగా అందుతున్న విధానంపై, అన్ని గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా సమస్యలు గమనించి, ఎప్పటికప్పుడూ చర్చించి తమ ద్వారా పరిష్కరించాలని చెప్పారు. ఫుడ్ కమిషన్ తమకు బాధ్యతలు కల్పిస్తున్నదన్నారు. ఈ వ్యాసరచన పోటీల్లో మొత్తం 36మంది సిబ్బంది పాల్గొని జాతీయ ఆహారభద్రత చట్టం అమలు జరుగుతున్న తీరుపై తమ సలహాలు, సూచనలు అందించారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీఆర్డీవో అదనపు పీడీ జంగారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.