చందూర్, డిసెంబర్ 18 : ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు మెరిశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు స్టేట్ టాపర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. మైనారిటీ ప్రభుత్వ గురుకులంలో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థినులు ఉత్తమ మార్కులు సాధించడంతో వారికి రూ.5లక్షల చొప్పున ఖర్చుచేసి పాఠశాల తరఫున ఉచితంగా నీట్, ఐఐటీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించనున్నారు.
చందూర్ మండల కేంద్రంలోని మైనారిటీ కాలేజీలో చదువుతున్న మాదనమ్ అభిజ్ఞ బైపీసీలో 440 మార్కులకు గాను 433 సాధించింది. రాష్టంలోని 204 మైనారిటీ కళాశాలల్లోనే ఆమె అత్యధిక మార్కులతో టాపర్‌గా నిలిచింది. అభిజ్ఞను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక అధికారి (సెక్రటరీ) షఫీయుల్లా అభినందించారు. ఉత్తమ మార్కులతో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు అర్హత సాధించడంతో మైనారిటీ పాఠశాల తరఫున ఆమెకు రూ. 5 లక్షలతో కోచింగ్ ఇప్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ధనలక్ష్మి తెలిపారు. అదే పాఠశాలో చదువుతున్న మరో ఇద్దరు విద్యార్థినులు సానియా తబస్సుమ్‌కు నీట్, జుబియా అంజుమ్‌కు ఐఐటీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిలో బోధన అందిస్తుండడంతోనే విద్యార్థులు రాష్టస్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారిని ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది శనివారం అభినందించారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తల్లి దండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీహెచ్‌డబ్ల్యూ టాపర్లకు డీఐఈవో అభినందన
ఇందూరు, డిసెంబర్ 18 : డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని వొకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) కోర్సులో స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన ఎల్.వసంత, సవితను నిజామాబాద్ డీఐఈవో రఘురాజ్ అభినందించారు. శనివారం వారిని తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ సంస్థల్లో చదువుకునే పేద విద్యార్థులు రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలువడం గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించి మంచి స్థానంలో నిలువాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రవిఠల్, అధ్యాపకులు పాల్గొన్నారు.