నేలకొండపల్లి, జనవరి 2 : జిల్లావ్యాప్తంగా రైతులు చెరుకు పంట సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో రైతులు వరి పంటను వదిలి ఇతర పంటల వైపు మళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర పంటలపై అవగాహన కల్పిస్తూ వ్యవసాయ నిపుణుల సలహాలు, సూచనలు అందజేస్తుండడంతో రైతులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో చెరుకు సాగు వైపు రైతులు దృష్టి సారించారు. నేలకొండపల్లిలో ఉన్న మధుకాన్ చక్కెర పరిశ్రమ పరిధిలో రైతులు ఈ సీజన్లో 10,500 ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికిరావడంతో గానుగ ఆడించేందుకు పరిశ్రమకు తరలిస్తున్నారు. సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు ఈ సీజన్లో వస్తుందని పరిశ్రమ యాజమాన్యం అంచనా. యాసంగిలో వరి సాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం తెలపడంతో అనేక మంది రైతులు ముందుచూపుతో చెరుకు పంటను వేసుకుంటున్నారు. ఈ ఏడాది అదనంగా మరో 4వేల ఎకరాల్లో రైతులు చెరుకు పంటను సాగు చేయనున్నారు.
మద్దతు ధర కంటే అదనంగా చెల్లింపు
చెరుకు పంటను పండించిన రైతులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర టన్నుకు రూ.3,039 మాత్రమే చెల్లిస్తుంది. ఇక్కడ పరిశ్రమ యాజమాన్యం రైతుల శ్రేయస్సు, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ మద్దతు ధరకు అదనంగా రూ.61 కలిపి టన్నుకు రూ.3,100 చెల్లిస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత చెరుకు పంటను సరఫరా చేసే వారికి ఇంకో రూ.50 కలిపి రూ.3,150 చెల్లించనున్నారు. మొత్తంగా చెరుకు రైతులకు ప్రభుత్వ మద్దతు ధరకు అదనంగా టన్నుకు రూ.111 పరిశ్రమ యాజమాన్యం చెల్లిస్తున్నది. అదేవిధంగా పరిశ్రమకు చెరుకును సరఫరా చేసే విషయంలో 40కిలోమీటర్ల దూరం పైబడి వచ్చే వారికి పరిశ్రమ రవాణ చార్జీలను భరిస్తుంది. దీంతో వరిని సాగు చేసే రైతులు ఈసారి చెరుకు పంటను వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు, అకాల వర్షాలు వచ్చిన సమయంలో వరి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతుండటంతో, వారు పం టను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అకాల వర్షాలు, తుఫానులు వచ్చినప్పటికి వాటిని తట్టుకునే శక్తి చెరుకు పంటకు ఉండటంతో ప్రత్యామ్నాయ పంటగా చెరుకును ఎంచుకుంటున్నారు. చెరుకు పంటను నరికేందుకు పరిశ్రమ వారే కూలీలను సమకూర్చుతుండటంతో రైతులకు కూలీల కొరత కూడా లేకుండాపోతుంది.
35ఏళ్లుగా చెరుకు పంట వేస్తున్నాను
నేను 35సంవత్సరాలుగా చెరుకు పంట సాగు చేస్తున్నాను. ఏటా 15 ఎకరాలు వేస్తాను. జంటసాళ్ల, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతుల్లో వేశాను. ఒకసారి వేసిన పంట ద్వారా మూడు నుంచి నాలుగేళ్లు దిగుబడి సాధిస్తుంటా. ఎకరానికి దాదాపు 60టన్నుల దిగుబడి వస్తుంది. పంటలో వచ్చే, ఇతర చెత్తను ఎరువుగా వాడుతాను. వరి కంటే చెరుకు పంట ఎంతో మేలు. రైతులు అందోళన చెందాల్సిన పనిలేదు. చెరుకులో ఒకసారి విత్తుకుంటే మూడు, నాలుగేళ్లు దిగుబడి ఇస్తుంది.
రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే అదనంగా టన్నుకు రూ. 111 చెల్లించడంతోపాటు రైతులకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. అవగాహన సదస్సులను నిర్వహించి పంట సాగుపై శాస్త్రవేత్తలతో సూచనలు, సలహాలు అందిస్తున్నాం. రైతుల ప్రయోజనాలు, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ప్రతి ఏడాది వివిధ ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి చెరుకు పంటను నరికిస్తుంటాం. రైతులకు అందుబాటులో చక్కెర పరిశ్రమ ఉన్నందున చెరుకు పంటను సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు.