
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై చూపుతున్న వివక్షపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్ల నిరాకరణపై యుద్ధం ప్రకటించారు.. ఇప్పటికే పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తారు.. దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ధాన్యం కొంటూ రాష్ట్రంలో కొనకపోవడంపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు గర్జించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు అనేక సార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.. అయినా.. కేంద్రం స్పందించలేదు.. దీంతో ఉద్యమ నేత కేసీఆర్ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, గులాబీ నేతలు ‘చావు డప్పు’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రఘునాథపాలెం మండలంలో చేపట్టనున్న ధర్నాలో మంత్రి అజయ్‌కుమార్ పాల్గొననున్నారు.
ఖమ్మం, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగంపై వివక్ష చూపుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సోమవారం శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, టీఆర్ఎస్ నేతలు ‘చావు డప్పు’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి గ్రామ ప్రధాన సెంటర్లు, మండల కేంద్రాల్లో ధర్నా చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయనున్నారు. ప్రజల గొంతుకగా నిలిచి ఉద్యమించనున్నారు.
రఘునాథపాలెంలో మంత్రి పువ్వాడ..
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం రఘునాథపాలెంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు నిరసనలో పాల్గొని తమ గళాన్ని వినిపించనున్నారు. మధిర నియోజకవర్గంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, భద్రాచలంలో నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు దీక్షలో పాల్గొననున్నారు. పార్టీ నేతలు ఇప్పటికే గ్రామాల్లో నిరసన కార్యక్రమాలపై చాటింపు సైతం వేయించారు. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నారు. నిరసన కార్యక్రమాలకు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున జన సమీకరణ చేయనున్నారు.
ఆందోళనకు సిద్ధమైన టీఆర్ఎస్
ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనకు దిగడంపై ఉమ్మడి జిల్లా బీజేపీయేతర పార్టీల నాయకులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినా మొండివైఖరి చూపడంపై టీఆర్ఎస్ ధ్వజమెత్తుతున్నది. ఈ విషయంపై సీఎంకే సీఆర్ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపడుతున్నారు. మరోవైపు ఎఫ్‌సీఐ అధికారులతో ధాన్యం కొనుగోలుపై చర్చిస్తున్నారు. ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిర్వహించే వ్యతిరేక ఉద్యమాల్లో తమను కూడా భాగస్వాములను చేసుకోవాలని వామపక్ష పార్టీల నేతలు, వాటి అనుబంధన సంఘాల నాయకులు ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించే నిరసనలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొననున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగి వచ్చే వరకు ఆందోళనలు చేపడతాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేంద్రంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రదర్శనలు చేపడతాం. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేస్తాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ధర్నాను విజయవంతం చేయాలి. బీజేపీ నేతల ద్వంద్వ వైఖరిని ప్రజలకు తెలియజేయాలి. రైతాంగానికి టీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.