సికింద్రాబాద్ : గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను వసూలు వేగం పెంచాలని జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్‌రెడ్డి అన్నారు. అలాగే శనివారం నుంచి ప్రారంభమయ్యే ఓటరు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో కృషి చేయాలని కోరారు. శుక్రవారం ఉదయం సర్కిల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తిపన్ను వసూళ్లను పెంచడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటరుగా నమోదు చేసుకున్నవారికి ఎన్నికల గుర్తింపు కార్డులను పొందడం కోసం ప్రత్యేక యాప్‌ను ఉపయోగించుకొనేలా చూడాలన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.