
అశ్వారావుపేట, జనవరి 3: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఆయిల్‌పాం సాగు విస్తరణకు తమ వర్సిటీ ప్రాధాన్యమిస్తోందని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ బీ.నీరజా ప్రభాకర్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు ప్రాచుర్యం ఉందని, అందుకు ఈ ప్రాంతంలో ఆయిల్‌పాం సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా శిక్షణనివ్వనున్నామని చెప్పారు. స్థానిక ఉద్యాన పరిశోధనా స్థానం (హెచ్ఆర్ఎస్)ను సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పది రోజుల పాటు ఇచ్చే శిక్షణను పూర్తి చేసుకున్న రైతులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. ఉద్యాన పంటల సాగును మరింత విస్తరించే చర్యల్లో భాగంగా మరో మూడు ఉద్యాన కళాశాలల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామన్నారు. ఉద్యాన పంటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రైతుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం దృష్టి సారించిందని వివరించారు. రాష్టంలో ఉద్యాన పంటల సాగుకు అనువైన భూములు ఉన్నాయని చెప్పారు. దీనితోపాటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
పరిశోధనలపై దృష్టి సారించండి..
ఉద్యాన పరిశోధనలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని వీసీ నీరజా ప్రభాకర్ సూచించారు. గతం కంటే పరిశోధనల్లో మరింత ప్రగతి చూపాలని చెప్పారు. స్థానిక హెచ్‌ఆర్‌ఎస్‌లో ఆమె విస్తృతంగా పర్యటించారు. అక్కడి నుంచి నారంవారిగూడెంలోని ఆయిల్‌ఫెడ్ నర్సరీని సందర్శించారు. నర్సరీలో మొక్కలను పరిశీలించిన ఆమె ఉద్యాన పరిశోధన కేంద్రంలో నర్సరీ ఏర్పాటుతోపాటు ప్లాంటేషన్ వేయనున్నామని డివిజనల్ ఆఫీసర్‌కు చెప్పారు. నర్సరీలో నాణ్యమైన మొక్కలు పెంచి రైతులకు పంపిణీ చేస్తామని, ప్రభుత్వం సాగు విస్తరణకు నిర్దేశించిన లక్ష్యంలో తమ వర్సిటీ కూడా భాగస్వామి అవుతుందని తెలిపారు. అనంతరం దమ్మపేట మండలం అప్పారావుపేటలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీలో పర్యటించారు. ఫ్యాక్టరీలో గెలల క్రషింగ్, క్రూడాయిల్ రికవరీ, ఉప ఉత్పత్తుల సేకరణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ.భగవాన్, హెచ్ఆర్ఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ హమీదున్నీసా బేగం, సైంటిస్ట్ డాక్టర్ విజయకృష్ణ, ఏఈవో హుస్సేన్, కట్టా సుబ్బారావు పాల్గొన్నారు.