
అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్, డిసెంబర్ 31: కొండరెడ్ల గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్ తెలిపారు. మండలంలోని కొండరెడ్ల గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. తొలుత రెడ్డిగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై తల్లిదండ్రులతో మాట్లాడారు. అక్కడ ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. వర్షానికి భవనం కురుస్తుందని, దీనివల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తల్లిదండ్రులు పీవో దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన పీవో పాత అంగన్వాడీ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించాలని స్థానిక ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. కొత్త భవనం పూర్తయ్యే వరకు కేంద్ర ప్రాంగణంలోని మరో భవనంలో కొనసాగించాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించాలనే ఉద్ధేశ్యంతో గిరి పోషణ పథకం కింద జోవర్ మీల్స్, మల్టీ గ్రెయిన్ మీల్స్, మల్టీ గ్రీన్ స్వీట్ మీల్స్‌ను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం బండారు గుంపు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజు, సర్పంచ్ మహేశ్వర్‌రెడ్డి, సురేశ్ బాబు, తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఐటీడీఏ డీఈ రాజు, సీడీపీవో రోజారాణి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, నాదేళ్ల సౌజన్య పాల్గొన్నారు.