కామారెడ్డి టౌన్/ నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 22 : స్పెషల్ సమ్మరి రివిజన్ -2022లో భాగంగా వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లకు సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమంపై బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా చూడాలన్నారు. ఎలక్ట్రోల్ లిటరసీ క్లబ్‌లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితాను గరుడ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను జాబితాలో చేర్చడంతో పాటు మార్పులు, చేర్పులు చేసి జనవరి 5 నాటికి తుదిజాబితా సిద్ధం చేసి ప్రచురించాలని కలెక్టర్లకు సూచించారు. జాబితాలను అన్ని గ్రామాల్లో ప్రదర్శించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, అర్హులైన వారందరి పేర్లను ఫామ్-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని సూచించారు. భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన గరుడ యాప్ వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి, యాప్ వినియోగంపై వారికి పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతినెలా కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బీఎల్వోల ద్వారా పరిశీలించి, ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ నెల ఈవీఎం గోదాములను తనిఖీ చేయాలని అన్నారు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. నిజామాబాద్‌లో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్ర శేఖర్, చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, ఆర్డీవో రవి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ సాయిభుజంగరావు పాల్గొన్నారు.