నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 10 : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా సంస్థ, పోలీసుశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన ‘శాంతియుత నడక’ను జిల్లా జడ్జి సునీత కుంచాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనను అనుసరించి ప్రపంచ దేశాలు మానవ హక్కుల చట్టాలను రూపొందించి అమలు చేస్తున్నాయన్నారు. మానవుడు స్వేచ్ఛాజీవి అని, అతడి స్వేచ్ఛను రక్షించడానికి చట్టాలను రూపొందించారని తెలిపారు. హక్కులతోపాటు బాధ్యతల బరువును కూడా మోయాలని సూచించారు. శాసన వ్యవస్థలు రూపొందించిన ప్రతి చట్టం ప్రజాప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. మరికొన్ని చట్టాలు ప్రజల డిమాండ్ కోసం రూపొందించారన్నారు. మానవ హక్కులతోపాటు విద్యాహక్కు, బాలలు, స్త్రీ హక్కులు వారి సాధికారతకు ఊతమిచ్చాయని పేర్కొన్నారు. అందరి బాగు కోసమే శాసనాలనీ, వాటిని గౌరవించడం, ఆచరించడంలో మనిషి గొప్పతనం దాగి ఉందన్నారు. అనంతరం జెండా ఊపి ‘శాంతియుత నడక’ను ప్రారంభించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారెడ్డి, ఆదాయపు పన్ను శాఖాధికారి అధికారి సంజయ్‌కృష్ణ, ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభాకర్‌రావు, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ బలరామ్, పోలీసులు, న్యాయవాదులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
జైలును సందర్శించిన జిల్లా జడ్జి
జిల్లా కేంద్రంలోని జైలును జిల్లా జడ్జి సునీత కుంచాల శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మానవ హక్కుల సదస్సులో ఆమె మాట్లాడారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఖైదీల రక్షణకు ప్రత్యేక చట్టం అమలులో ఉందని తెలిపారు. న్యాయస్థానంలో శిక్షకు గురైన వారికి ప్రత్యేక న్యాయ సహాయం అందిస్తామన్నారు. వారికి చట్ట పరిధిలో దక్కాల్సిన ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, మాణిక్‌రాజ్, జైలు అధికారులు పాల్గొన్నారు.