
చింతకాని మండలంలో భూములన్నీ నల్ల రేగడి, ఎర్ర నేలలే. నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి పుష్కలంగా సాగునీరందుతుండడంతో ఇక్కడి రైతులు మొక్కజొన్నపై మక్కువ చూపుతున్నారు. మిగతా పంటలతో పోలిస్తే మక్కల సాగుకు పెట్టుబడి తక్కువ కావడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మండలంలో మొత్తం సాగు విస్తీర్ణం సుమారు 50 వేల ఎకరాలు ఉండగా.. యాసంగిలో 24వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది.
చింతకాని, డిసెంబర్ 24: చింతకాని మండలంలోని నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలం. ఏటా యాసంగిలో రైతులు మొక్కజొన్న సాగు చేయడానికే ఇష్టపడతారు. మండలంలో మొత్తం సాగు విస్తీర్ణం సుమారు 50 వేల ఎకరాలు ఉండగా యాసంగిలో 24 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. మెట్ట ప్రాంతాల్లో వానకాలంలోనూ మొక్కజొన్న సాగు కావడం మరో విశేషం. మిగతా పంటలతో పోలిస్తే మక్కల సాగుకు పెట్టుబడి తక్కువ కావడంతోనే రైతులు దీని సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. గడిచిన కొద్ది సంవత్సరాలుగా పత్తిని చీడపీడలు ఆశించడం, రైతులు భారీగా నష్టాలు చవిచూడడమూ మక్కల సాగు పెరగడానికి కారణాలే. ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులు సాధారణంగా ఎకరానికి 35-42 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తారు. ప్రభుత్వం క్వింటా మక్కలకు రూ.1,825 మద్దతు ధర అందిస్తున్నది. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడులు పోయినా రూ.50 వేల వరకు లాభాలు గడించవచ్చని రైతులు వెల్లడిస్తున్నారు. దళారుల మధ్యవర్తిత్వం లేకుండా పీఏసీఎస్ కే్రందాలు, మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే మొక్కలను కొనడమూ రైతులకు కలిసి వస్తున్నది. మక్కల విక్రయం పూర్తయిన కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తున్నది. ఇక్కడి రైతులు యాసంగిలో మొక్కజొన్నతోపాటు మిర్చి, పత్తి, వేరుశనగ, సుబాబుల్, పెసర, మినుములు సాగు చేస్తారు. మండలంలోని భూములన్నీ నల్ల రేగడి, ఎర్ర నేలలే. నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి పుష్కలంగా సాగునీరు అందుతుండడంతో సాగు సులువైంది.
రెండు పంటలకు వేర్వేరు కౌలు విధానం..
మండలాన్ని వాణిజ్య పంటల కేంద్రంగా చెప్పవచ్చు. మండలంలో కౌలు విధానం రెండు విధాలుగా ఉంటుంది. యాసంగికి ఒక కౌలు ధర, వానకాలానికి మరో కౌలు ధర ఉంటుంది. కౌలు డబ్బులు సైతం పంట సాగుకు ముందే పట్టాదారుకు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో ఏడాది మొత్తానికి ఒకసారి కౌలు చెల్లింపు పద్ధతి ఉంటుంది. ఇక్కడి సారవంతమైన నేలలకు డిమాండ్ చాలా ఎక్కువ.
అందుబాటులో ఎరువులు..
మండలంలోని నాగులవంచ, చింతకానిలో వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పంటల సాగుపై ఇప్పటికే అంచనాకు వచ్చిన సొసైటీ రైతులకు అవసరమైన ఎరువులను సిద్ధం చేస్తున్నది. వ్యవసాయ, సహకార సంఘాల అధికారుల సమన్వయంతో రైతులకు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు ఎరువులు విక్రయించకుండా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటున్నది. డీలర్లు ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మొక్కజొన్న సాగులో వ్యవసాయశాఖ సూచనల మేరకు పరిమితంగా ఎరువులు వాడాలంటున్నారు. ప్రస్తుతం మక్కలు విత్తే సమయం మించిందని, రైతులు ఇప్పటి నుంచి ఆరుతడి పంటలను సాగు చేస్తే మంచిదంటున్నారు.
ఇతర పంటల సాగు
రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు మండలానికి చెందిన రైతులు యాసంగిలో వరి కాకుండా మక్కలు, వేరుశనగ, మినుము, పెసర పంటలు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మండలంలో ఏటా యాసంగిలో మక్కల సాగు ఎక్కువ. వ్యవసాయశాఖ అధికారులు, రైతుబంధు సమితి సభ్యుల సూచనలను పాటిస్తూ రైతులు సాగు చేపడుతున్నారు.
రైతులకు అండగా సొసైటీ..
మండలానికి చెందిన రైతులు విస్తారంగా మొక్కజొన్న సాగు చేస్తారు. విస్తీర్ణానికి తగినంత ఎరువులను సిద్ధం చేస్తున్నాం. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను వివరిస్తున్నాం. రైతాంగం ఆరుతడి పంటలనూ పండించాలి. వారికి సొసైటీ నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయి.