
‘రైతుబంధు’తో పల్లెపల్లెనా కర్షకలోకం పండుగ చేసుకుంటున్నది. అదునుకు ఆసరా అయ్యేలా పెట్టుబడి సాయం ఇస్తున్న రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నది. ఈ సందర్భంగా ఊరూరా నిర్వహిస్తున్న రైతుబంధు సంబురాల్లో పాల్గొంటూ తీరొక్క రీతిలో కృతజ్ఞతలు తెలుపుతున్నది. వారోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతులు ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయగా.. బాలికలు, మహిళలు రైతు వేదికలు, పాఠశాలల్లో ఉత్సాహంగా ముగ్గులేశారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మెదక్‌లో రైతు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు.
సిద్దిపేట, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సంక్రాంతి పండుగ సందడి ముందే వచ్చింది… రైతుల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయి. పంట చేతికొచ్చిన సమయంలో రైతుకు ఎంత ఆనందం ఉంటుందో.. ఇప్పుడు కూడా అదే ఆనందం. ఎక్కడ చూసినా.. విన్నా… రైతు బంధు ముచ్చట్లే. ‘సీఎం కేసీఆర్ ఖాతాల్లో డబ్బులు వేసిండు. చాలా సంతోషంగా ఉంది. పెట్టుబడి పోను మిగిలిన పైసలను ఇతర అవసరాలకు వినియోగించుకుంటాం. ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుంటాం’ అని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన రైతులు అంటున్నారు. శనివారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రైతు సంబురాలు జోరుగా జరిగాయి. ఎడ్లబండ్ల ర్యాలీలు, ముగ్గుల పోటీలు, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు, ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం సందడిగా సాగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రం పత్తి మార్కెట్ యార్డులో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు. మహిళా రైతులు ముగ్గులు వేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం, వడ్లతో అభిషేకం నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు మంత్రి హరీశ్‌రావు బహుమతులు ప్రదానం చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గజ్వేల్‌లో ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, దుబ్బాక, హుస్నాబాద్‌లలో ఆయా గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆందోల్‌లో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, మహిపాల్‌రెడ్డి, జడ్పీచైర్మన్లు మంజు శ్రీ, హేమలత, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, రైతు బంధు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్లొన్నారు.