
రఘునాథపాలెం, డిసెంబర్ 19 : మండలంలోని చింతగుర్తి గ్రామంలో కొత్తగా నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో పెద్దమ్మతల్లి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయకుమార్కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పెద్దమ్మతల్లికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాది సంఖ్యలో హాజరయ్యారు. చింతగుర్తి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బంధువుల రాకతో ప్రతి ఇల్లూ సందడిగా మారింది. గ్రామస్తులు ఆడబిడ్డలను ఆహ్వానించి సారెను బహుమతిగా అందజేశారు. సర్పంచ్ మెంటెం రామారావు, మాజీ సర్పంచ్ తమ్మిన్ని నాగేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ కేతినేని సీతరామయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. బలిహరణ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది.