
కలెక్టర్ పమేలా సత్పతి
రామన్నపేట, డిసెంబర్22 : యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా రైతు సదస్సును నిర్వహించారు. అగ్రికల్చర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె ప్రారంభించి పరిశీలించారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… రైతులు సాగు మెళకువలు పాటించి తక్కువ పెట్టుబడితో అధిక దిగబడులను సాధించవచ్చని అన్నారు. కోతులు, అడవి పందుల నివారణకు సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నపూర్ణ, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ గుత్తా నర్సింహారెడ్డి, మండల కో ఆర్డినేటర్ బత్తుల కృష్ణయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, ఏరువాక శాస్త్రవేత్తలు మధుశేఖర్, నరేందర్, ఉద్యానశాఖ అధికారి సౌమ్య, ఏఓ యాదగిరిరావు, ఎంపీటీసీ వనం హర్షిణి, కోఆప్షన్ సభ్యుడు, నాయకులు ఆవుల నరేందర్, బత్తుల వెంకటేశం, బద్దుల రవి, ఆమేర్, వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీనివాస్, వెంకటేశం, కృష్ణ, నరేశ్, కిరణ్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
రామన్నపేట : దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఏరియా దవాఖానను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా కాన్పుల వార్డులోకి వెళ్లి రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆమె వెంట సూపరింటెండెంట్ విజయలక్ష్మి, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి, వైద్యులు నిఖిల, ఈసం వెంకటేశ్వర్లు, రవికుమార్ ఉన్నారు.
ఓటు నమోదుపై అవగాహన కల్పించాలి
భువనగిరి అర్బన్, డిసెంబర్ 22 : ఓటు నమోదుపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా చూడాలని అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఓటు నమోదుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను నిరంతరం కొనసాగించాలన్నారు. జిల్లాలోని ఈవీఎంలను కొత్త గోడౌన్లకు తరలించాలని, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రచారం చేయాలని చెప్పారు. జిల్లాలో 5,129 ఓటు నమోదుకు దరఖాస్తులు వచ్చాయని, 533 దరఖాస్తులు తిరస్కరించగా, 4,579 మంది ఓటర్లుగా నమోదయ్యాయని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి, భువనగిరి తాసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వీరాబాయి పాల్గొన్నారు.