పటాన్చెరు, డిసెంబర్ 20 : అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు కట్టకు అడ్డంగా గేటు నిర్మాణం చేపట్టడంపై ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురించిన ‘అమీన్పూర్ చెరు వు కట్ట ఆక్రమణ’ కథనంపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదివారం స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసుశాఖ అధికారుల బృందం సంయుక్త సర్వే నిర్వహించింది. రెండు రోజుల క్రితం వరకు స్థలం తమదంటూ అధికారులతో ఘర్షణకు దిగిన ఆక్రమణదారులు సంయుక్త సర్వేకు వస్తున్నారని సమాచారం తెలుసుకుని జేసీబీలు, కూలీలతో అప్పటికప్పుడు వాటిని తొలిగించి, అక్కడ నుంచి మాయమైపోయారు. ఇరిగేషన్‌శాఖ డీఈ ఉదయ్‌భాస్కర్, అమీన్పూర్ తహసీల్దార్ విజయ్‌కుమార్, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత, అమీన్పూర్ ఎస్ఐ రాజేందర్‌రెడ్డి బృందం తమ సిబ్బందితో ఆక్రమణలు జరిగిన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే గేట్, కాంపౌండ్‌వాల్ తొలగించి ఉండగా, చెరువుకట్టను జేసీబీలతో ధ్వంసం చేసిన ఆనవాళ్లను జాయింట్ కమిటీ పరిశీలించింది. పెద్ద చెరువుకట్టపై వందమీటర్లకుపైగా బండరాళ్లను వేయడాన్ని గుర్తించింది. అలాగే, కొత్త చెరువు ఎఫ్‌టీఎల్‌లోనూ చదును చేశారు. పెద్దపెద్ద బండరాళ్లను పూడ్చి విశాలంగా చేస్తున్నారు. కాగా, ప్రైవేటు వ్యక్తులకు ఎంత స్థలం ఉంది. పెద్ద చెరువు, కొత్త చెరువు ఏ స్థాయిలో ఆక్రమించి ధ్వంసం చేశారో పూర్తి స్థాయి సర్వే నిర్వహించి రిపోర్టు తయారు చేస్తామని కమిటీ తెలిపింది. అమీన్‌ఫూర్ పెద్దచెరువులో అక్రమ నిర్మాణాలు చేశారని, చెరువుకట్టకు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. అరుదైన పక్షుల నిలయంలో జీవవైవిద్యాన్ని దెబ్బతీశారని, ఈ దారుణానికి కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలుంటాయని, పోలీసు కేసు నమోదు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఈ ప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ మధుసూధన్‌రెడ్డి, ఆర్ఐ మల్లేశం, ఎస్ఐ రాజేందర్‌రెడ్డి, వీఆర్ఏ లక్ష్మణ్, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
కొత్త చెరువుకు లింక్ రోడ్డు ఇది
పెద్ద చెరువు నుంచి కొత్త చెరువుకు కట్టపై లింక్‌రోడ్డు ఉంది. రెండురోజుల్లో కట్టపై గేటును పెట్టి, కొత్త చెరువు వైపు దారిని ధ్వంసం చేశారు. అక్రమంగా నిర్మాణాలు చేసి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ప్రైవేటు పట్టాల్లోనూ జలవనరులుంటే వాటిని సైతం ముట్టుకునే హక్కు లేదు. స్థలం మాదని కొం దరు ఇరిగేషన్ డీఈఈ ప్రసాద్‌ను, వర్క్ ఇన్స్పెక్టర్ మధుసూధన్‌రెడ్డిని దుర్భాషలాడారు. చెరువుకు నష్టం చేసిన వారిపై, దుర్భాషలాడిన వ్యక్తులపైనా కేసులు నమోదు చేస్తాం.
-ఉదయ్‌భాస్కర్, డీఈ
జిల్లా అధికారులకు నివేదిక ఇస్తాం
జాయింట్ కమిటీ పరిశీలించిన అంశాలను జిల్లా అధికారులకు నివేదిక ఇస్తాం. చెరువులకు ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి. ఏ సర్వే నంబర్ ఎవరిది లాంటి అన్ని వివరాలు ఇస్తాం. రెండురోజుల క్రితం ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవని రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నది. సర్వే రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటాం. బఫర్‌జోన్‌కు హానీ చేయడం, కట్టను ధ్వంసం చేయడం గు ర్తించాం. కొన్ని సర్వే నంబర్లు కోర్టు వివాదాల్లో ఉన్నాయి.
-విజయ్‌కుమార్, తహసీల్దార్, అమీన్పూర్
నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదు
పెద్దచెరువు కట్టపై, బఫర్‌జోన్‌లో గేటు, కాంపౌండ్‌వాల్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. మా సిబ్బంది అక్ర మ నిర్మాణాలుంటే ఫిర్యాదు చేస్తారు. ఇలా ఆక్రమణలు చేయడం చట్టవిరుద్ధం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక మీదట చెరువుల చుట్టూ నిత్యం పహారా పెడతాం.
సుజాత, మున్సిపల్ కమిషనర్, అమీన్పూర్
అమీన్పూర్ పెద్దచెరువు, కొత్త చెరువు ఆక్రమణ స్థలాలను ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు అధికారులు పరిశీలించారు. కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు సోమవారం సంయుక్త సర్వే నిర్వహించారు. పెద్ద చెరువులో బండరాళ్లను జరిపి కాంపౌండ్వాల్గా మార్చడం, చెరువు కట్టపై పెద్దపెద్ద బండరాళ్లను దారికి అడ్డంగా పెట్టినట్లు గుర్తించారు. కొత్త చెరువు ఎఫ్టీఎల్లో భూమిని చదును చేసి విశాలమైన స్థలాలుగా మార్చడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయితే, పూర్తి స్థాయి సర్వే చేసి ప్రైవేటు వ్యక్తులకు ఎంత స్థలం ఉంది. పెద్ద చెరువు, కొత్త చెరువులను ఏ స్థాయిలో ధ్వంసం చేశారో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. కాగా, అధికారులు సర్వే సమాచారం ముందే తెలుసుకున్న ఆక్రమణదారులు అక్కడ చేపట్టిన నిర్మాణాలను అప్పటికప్పుడు తొలిగించి అక్కడి నుంచి పరారవ్వడం కొసమెరుపు.