
సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ప్రారంభించింది. పల్లె నేపథ్యం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ సంక్రాంతి సొంతూళ్లో జరుపుకోవాలనుకోవడం సహజం. ఆ రద్దీకి అనుగుణంగా యాదగిరిగుట్ట డిపో పరిధిలో 20 నుంచి 30 బస్సులను అదనంగా కేటాయించారు. జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ డిపోలతోపాటు వరంగల్, హన్మకొండ, ఏపీలోని అమలాపురానికి స్పెషల్ సర్వీసులు నడుపుతున్నారు. ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో అధికారులు కొవిడ్ నిబంధనలను తప్పనిసరి చేశారు. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. మాస్క్ ధరిస్తేనే ప్రయాణికులకు అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుమలగిరి, మోత్కూరు, భువనగిరిలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేశారు.
యాదాద్రి, జనవరి 8 : జిల్లా నుంచి ఈ నెల 8 నుంచి 19వ వరకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 8 నుంచి 15 వరకు రోజుకు 20 -30 బస్సులు అదనంగా నడుపనున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రూట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే పండుగ ముగిసిన తరువాత ఈ నెల 15 నుంచి 19వ తేదీల్లో తిరుగు ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.
రద్దీ రూట్లపై దృష్టి
జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి భువనగిరి మీదుగా తిరుమలగిరి, మోత్కూరు, నల్లగొండ, సూర్యాపేటకు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. హరితరాళ్ల, మామిడ్లమడవ, లక్ష్మీదేవికాల్వ, దత్తప్పగూడెం, పాలడుగుతోపాటు సూర్యాపేటలో అధిక రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దాంతో ఆ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పండుగ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులన్నీ ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్‌తోపాటు నగరంలోని పలు ప్రాంతాలకు వరకు వెళ్తాయి. వీటిలో ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్‌తో పాటు పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులతోపాటు హన్మకొండ, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్‌కు ప్రస్తుతం నడిచే బస్సులను కొనసాగించనున్నారు.
అమలాపురానికి ప్రత్యేక బస్సు..
సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరిగుట్ట డిపో నుంచి సూపర్‌లగ్జరీ బస్సును ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి నడుపనున్నారు. యాదగిరిగుట్ట డిపో నుంచి హైదరాబాద్ మీదుగా ఈ బస్సు అమలాపురం వెళ్లనుంది.
ప్రత్యేక బృందాలు..
రెండేళ్లలో కొవిడ్ కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ అంతంత మాత్రమే ఉంది. దాంతో సంస్థకు ఎంతో నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితి నుంచి లాభాల వైపు నడిపించడానికి అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ తయారు చేసింది. ఈ నెల 15న సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రయాణికులను చేరవేయడానికి ప్రత్యేక టీమ్‌లు హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుమలగిరి, మోత్కూరు, భువనగిరిలో పని చేయబోతున్నాయి. డిపోల వారీగా బస్సుల నిలుపుదల.. ప్రయాణికులను గమ్యస్థానం చేర్చడంపై డీఎంలు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జగద్గిరిగుట్ట, ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు ఉండి ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటారు.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి…
ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే మాస్కు ధరించడంతోపాటు భౌతిక దూరం తప్పనిసరి చేశారు. బస్సు డ్రైవర్లతోపాటు కండక్టర్లు కూడా మాస్కు ధరించాలి. సగం సీట్లలోనే ప్రయాణించాలన్న నిబంధన కొనసాగించనున్నారు. ప్రతి బస్సులో శానిటైజర్ అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కే సమయంలో చేతులు శానిటైజ్ చేసుకోవాలి. ఆర్టీసీ సిబ్బంది సైతం విధుల్లోకి వెళ్లే సమయంలో చేతులు శానిటైజ్ చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. డిపో వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.
రద్దీకి అనుగుణంగా బస్సులు
సంక్రాంతి పండుగకు ప్రత్యేక వాహనాలను నడపాలని భావిస్తున్నాం. ఈ నెల 8 నుంచి 19 వరకు ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తాం. కొవిడ్ కారణంగా రెండేండ్లలో వాటిల్లిన నష్టాన్ని సంక్రాంతి ప్రయాణికుల రద్దీ ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన కొవిడ్-19 నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నాం.