నేతన్నల పోరు ఫలించింది. వస్త్ర ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ అమలు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి పొందే ఈ పరిశ్రమపై పన్నులు విధించడాన్ని తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది. అంతే కాదు, పన్ను తొలగించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖతో కేంద్రం దిగివచ్చింది. పన్నులు పెంచబోమంటూ కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా నేతన్నల్లో ఆనందం వెల్లి విరిసింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లాలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి సంబురాలు జరుపుకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసింది.
-రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)
తొందర పాటు నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం తరచూ ఆబాసు పాలవుతున్నది. కొత్త వ్యవసాయ నల్ల చట్టాలు ప్రవేశపెట్టి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకున్నది. అంతే కాకుండా, చాలా మంది రైతుల ఉసురు తీసుకున్నది. దేశవ్యాప్తంగా అన్నదాతలు నిర్విరామంగా ఆందోళనలు కొనసాగించడంతో నల్ల చట్టాలను రద్దు చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయం తర్వాత అత్యధిక మంది కార్మికులు ఉపాధి పొందుతున్న వస్త్ర పరిశ్రమ ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. అయితే, ఈ అనాలోచిత నిర్ణయంతో అనేక మంది రోడ్డున పడనుండడంతో వారం రోజులుగా నేత కార్మికులు పోరుబాట పట్టారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్స్ పరిశ్రమలు జనవరి 1నుంచి బంద్‌కు పిలుపునిచ్చాయి. వస్త్ర పరిశ్రమకు మూల స్తంభాలైన గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ర్టాల్లో నిరసనలు, ఆందోళనలు జోరందుకున్నాయి. రోడ్డెక్కి నిరసన దీక్షలు, రాస్తారోకోలు చేపట్టారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర ఉత్పత్తిదారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిరాహార దీక్షలు చేపట్టారు.
మంత్రి కేటీఆర్ లేఖతో దిగొచ్చిన కేంద్రం
చేనేత, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా, మంత్రి కేటీఆర్ ఈ నెల 29న కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఘాటైన లేఖ రాశారు. చేనేత, వస్త్ర పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచడం దారుణమని, దీని వల్ల చేనేత, వస్త్ర పరిశ్రమ కుదేలవుతుందని, 15 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్లో చర్చించాలని కోరారు. లేఖ రాసిన రెండు రోజుల్లోనే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
విజయోత్సవ ర్యాలీలు
తెలంగాణ సర్కారు అండగా నిలువడం, మంత్రి కేటీఆర్ చొరవతో కేంద్రం దిగిరావడంతో నేతన్నల ఆనందానికి అవధులు లేకుండా పోయా యి. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్నలంతా విజయోత్సవ ర్యాలీ తీసి, సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచి పెట్టారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవడంతో జనవరి 1నుంచి పరిశ్రమల బంద్‌ను విరమించుకున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం, గంగాధర మండలం గర్శకుర్తిలో నేత కార్మికులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.
మంత్రి కేటీఆర్ చొరవతోనే..
మంత్రి కేటీఆర్ అనేక సార్లు లేఖలు రాయడం, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒత్తిడి రావడంతోనే కేంద్రం దిగొచ్చింది. వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని వాయిదా వేయకుండా శాశ్వతంగా తొలగించాలి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
-కట్టెకోల లక్ష్మీనారాయణ, సిరిసిల్ల కాటన్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు
జీఎస్టీ పూర్తిగా తొలగించాలి
వస్త్ర ఉత్పత్తులపై పెంచిన 12 శాతం జీఎస్టీని తగ్గించాలని మేం చేసిన దీక్షలకు రాష్ట్ర సర్కారు మద్దతు తెలుపడం హర్షణీయం. జీఎస్టీ వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తీసుకురావడంతోనే వాయిదా వేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అబాసుపాలు కావద్దు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడద్దు..
రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది.
రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ వస్త్ర పరిశ్రమకు అండగా ఉంటున్నది. కేంద్రం మాత్రం పన్నుల మీద పన్నులు వేస్తూ పరిశ్రమ నడవకుండ చేస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జీఎస్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రమంత్రిపై ఒత్తిడి తెచ్చారు. అందువల్లనే కేంద్రం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. నేతన్నల పక్షాన మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.