సూర్యభగవానుడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 40డిగ్రీలకు పైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఎండలు మండిపోతుండడంతో బయటకు వెళ్లేందుకు జనం వెనుకాడుతున్నారు. వేసవిలో వ్యాధులు, వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరు సంవత్సరాల్లోపు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి.
– రామగిరి/నేరేడుచర్ల, ఏప్రిల్ 23
వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా ముఖ్యంగా వడదెబ్బ, వేడి సింకోబు, వేడికొంకర్లు రావడంతోపాటు చర్మం నల్లబారుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధులు ప్రాణాంతకం కూడా కావొచ్చు. మెదడులోని ఉష్ణాన్ని, వివిధ భావోద్వేగాలను నియంత్రించే హైపోథాలామస్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దాంతో ఉష్ణ ఉత్పత్తి, ఉష్ణం విడుదల మధ్య సమతుల్యం లోపించి కొన్ని సందర్భాల్లో కండర, నాడీ వ్యవస్థపై ప్రభావం
చూపుతుంది.
వేడి ప్రదర్శనలో(కొలిమిలు, బాయిలర్స్, స్టవ్లు, ఆరు బయట ఎండలలో) పని చేసే వారు ఆకస్మికంగా స్ఫృహ కోల్పోతారు. దీన్ని వేడి సిన్కోప్ అంటారు. ఇలాంటి పిల్లలను, పెద్దలను వెంటనే విశ్రాంతికి చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. చల్లటి నీరు తాగించి పండ్ల రసాలను ఇవ్వాలి.
వేడి ప్రదేశాల్లో పని చేస్తుంటే కొంత మందికి కాళ్లు అతిగా నొప్పి పుట్టడం, కొంకర్లు పోవడం జరుగుతుంది. ఈ స్థితిలో శరీరం నుంచి సోడియం క్లోరైడ్ చెమట రూపంలో బయటకు వెళ్తుంది. ఈ స్థితిని వేడి కొంకర్లు అంటారు. వీరిని వెంటనే నీడలోకి చేర్చి ఉప్పు, పంచదార కలిపిన నీటిని తాగించాలి. దీంతో నష్టపోయిన సోడియం లవణాలు భర్తీ అవుతాయి. నెమ్మదిగా ఒత్తిడి తగ్గడం వల్ల కండరాల కొంకర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వేసవిలో సంభవించే వడదెబ్బ అతి ప్రమాదకరమైంది. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పని చేయక పోవడం వల్ల ఇది వస్తుంది. సాధారణంగా వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్ హీట్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే (105 డిగ్రీల నుంచి107 డిగ్రీల ఫారెన్ హీట్స్ వరకు) దాటితే వడదెబ్బ వస్తుంది. దీనినే ఎండ దెబ్బ అంటారు.