e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News ‘స్థానిక’ ఎమ్మెల్సీ పోలింగ్‌కు సర్వం సిద్ధం

‘స్థానిక’ ఎమ్మెల్సీ పోలింగ్‌కు సర్వం సిద్ధం

  • రేపటి పోలింగ్‌కు ఏర్పాట్లు చేసిన అధికారులు
  • నేడు పోలింగ్‌ సామగ్రి పంపిణీ
  • సిబ్బందికి విధుల కేటాయింపు
  • 8 కేంద్రాలు..1271 మంది ఓటర్లు
  • మొత్తం ఓటర్లలో 804 మంది టీఆర్‌ఎస్‌ వారే
  • వీరికి అదనంగా ఎక్స్‌అఫీషియో ఓటర్లు
  • ఏకపక్ష విజయంపై టీఆర్‌ఎస్‌ ధీమా
  • ఓటింగ్‌ విధానంపై మాక్‌ పోలింగ్‌తో అవగాహన

నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగనున్న పోలింగ్‌ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఆయా జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూటరీ సెంటర్ల నుంచి పోలింగ్‌ సిబ్బంది సామగ్రిని తీసుకుని సాయంత్రానికి కేంద్రాలకు చేరుకోనున్నారు. రెవెన్యూ డివిజన్‌ కేంద్రానికి ఒక పోలింగ్‌ బూత్‌ చొప్పున మొత్తం 8 బూత్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో 1271 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లలో 804 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉండడంతో విజయం ఏకపక్షమేనని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. మరోవైపు ప్రాధాన్యతా క్రమంలో జరిగే ఓటింగ్‌ విధానంపై తమ ఓటర్లకు టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గాల వారీగా మాక్‌పోలింగ్‌ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నది. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీలేవీ బరిలో లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం నామమాత్రమే కానుందని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్‌ 8(నమస్తే తెలంగాణ) :ఆరేండ్లకోసారి జరిగే స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం జరుగనుంది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, భువనగిరి, చౌటుప్పల్‌లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు ఆయా జిల్లా కేంద్రాల్లో గురువారం పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేయనున్నారు. మొత్తం 40 మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. వీరంతా నేడు సాయంత్రానికే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోనున్నారు. ఆదివారం ఉదయం 8 నుంచి సా యంత్రం 4 గంటల పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి పోలీస్‌ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను నల్లగొండ జిల్లా కేంద్రానికి తరలించి స్ట్రాంగ్‌ రూమ్స్‌లో భద్రపరుస్తారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు

- Advertisement -

టీఆర్‌ఎస్‌దే ఏకపక్ష విజయం..

ఈ ఎన్నికల్లో మొత్తం 1,278 మంది ఓటర్లు ఉండగా అందులో ఏడు స్థానాలు ఖాళీలుగా ఉన్నాయి. దీంతో 1,271 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇందు లో ఓటర్లుగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లలో ఎక్కువ మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. మొత్తం ఓటర్లలో ఎక్స్‌అఫీషియో ఓటర్లు 19 మంది ఉండగా మిగతా వారు 1,252 మంది ఉన్నారు. ఇందులో టీఆర్‌ఎస్‌కు చెందిన వారే 804 మంది ఉన్నట్లు అంచనా. వీరు పోగా కాంగ్రెస్‌కు చెందిన వారు 382, బీజేపీ 35, సీపీఎం 17, సీపీఐ 5, ఇతరులు 9 మంది ఉన్నారు. ఎక్స్‌ అఫీషియో ఓటర్లలోనూ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు చెంది న వారు కాగా టీచర్స్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఓటింగ్‌ ప్రక్రియపై అవగాహన

ఉమ్మడి జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, శేరి సుభాశ్‌ రెడ్డితో పాటు పదిమంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థ్ధి ఎంసీ కోటిరెడ్డి విజయం ఏకపక్షమేనన్న చర్చ సర్వత్రా నెలకొంది. అయినా సరే తమ పార్టీ ఓటర్లందరికీ ఓటింగ్‌ ప్రక్రియపై అవగాహన కల్పించారు. నియోజకవర్గాల వారీగా ఓటర్లకు మాక్‌పోలింగ్‌ నిర్వహిస్తూ ప్రాధాన్యత ప్రకారం ఎలా ఓట్లు వేయాలనే దానిపై వివరిస్తున్నారు.

పోలింగ్‌ కేంద్రం పరిశీలన

హుజూర్‌నగర్‌టౌన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ మోహన్‌రావు బుధవారం పరిశీలించారు. పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 6 వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. హుజూర్‌నగర్‌ డివిజన్‌ కేంద్రంలో మొత్తం 123 ఓట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ఓటు వేయనున్నారు. తాసీల్దార్‌ జయశ్రీ, ఎంపీడీఓ శాంతకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఓటర్లలో గందరగోళం

మరోవైపు స్వతంత్ర అభ్యర్థ్ధులుగా బరిలో ఉన్న ఆరుగురు కూడా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ వారి మధ్య సయోధ్య లేదు. వీరిలో ప్రధానంగా ఎంపీ కోమటిరెడ్డి వర్గానికి చెందిన వంగూరి లక్ష్మయ్య, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వర్గానికి చెందిన కుడుదుల నగేశ్‌ పోటీ పడుతున్నారు. వీరిద్దరూ తమ పార్టీకి చెందిన ఓటర్లను కలుస్తూ తమకంటే తమకే ఓట్లు వేయాలని కోరుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ ఓటర్ల లో గందరగోళం నెలకొంది. ఇక ఇతర పార్టీల ఓటర్లు కూడా సందిగ్ధంలోనే ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement