
గతుకుల రోడ్లు.. పారిశుధ్య లోపం.. ఏండ్ల నాటి సమస్యల పరిష్కారానికి పల్లెప్రగతి దారి చూపింది. దాదాపు కోటిన్నర వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి. పచ్చదనం, పారిశుధ్యానికి తోడు అన్నింటా సాధించిన ప్రగతితో నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా నిలిచింది. మూడేండ్లలోనే సకల సౌకర్యాలతో ఆకట్టుకుంటున్నది. పల్లెప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన మొక్కలు, వార్డుల్లో సీసీరోడ్లు, చివరి మజిలీని ప్రశాంతంగా నిర్వహించేలా వైకుంఠ ధామాన్ని కూడా తీర్చిదిద్దారు. బర్నింగ్ దిమ్మెలు, మహిళా, పురుషుల స్నానపు గదులు, సకల సౌకర్యాలు కల్పించారు.
మండలంలో నాగిరెడ్డిపల్లి అతిపెద్ద గ్రామ పంచాయతీ. గ్రామంలో 340 ఇండ్లు, 1122 జనాభా, 1,140మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు అందక గ్రామం అభివృద్ధికి నోచలేదు. ఎక్కడపడితే అక్కడ చెత్తతో వీధులు అపరిశుభ్రంగా ఉండేవి. డ్రైనేజీ కాల్వలు కవర్లు, పేపర్లు, చెత్తతో నిండి దుర్వాసన వెదజల్లేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన పల్లెప్రగతితో గ్రామం రూపురేఖలు మారాయి. పారిశుధ్య కార్మికులు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చెత్త తరలిస్తుండడంతో గ్రామం మొత్తం పరిశుభ్రంగా మారింది. వీధుల్లో నాటిన మొక్కలతో హరితమయమైంది. గతంలో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియలు రోడ్డు సమీపంలోని పొలాల పక్కన జరిపించేవారు. ప్రస్తుతం గ్రామానికి అరకిలోమీటర్ దూరంలో వైకుంఠధామం నిర్మించడంతో సకల వసతుల మధ్య అంత్యక్రియలు జరిపిస్తున్నారు. ప్రత్యేకంగా బర్నింగ్ దిమ్మెలు, పురుషుల, మహిళలకు స్నానపు గదులు, వాటర్ ట్యాంకు నిర్మించారు.
అభివృద్ధిలో ఆదర్శం…
రూ.9.70 లక్షలతో ట్రాలీట్రాక్టర్, ట్యాంకర్ కొనుగోలు చేశారు. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేసి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నారు. డంపింగ్‌యార్డు స్థల సేకరణ పూర్తి కావడంతో త్వరలోనే నిర్మాణం ప్రారంభించనున్నారు. శిథిలావస్థకు చేరిన ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. లూజు వైర్లను సరిచేయడంతో పాటు మూడో తీగ అమర్చారు. హరితహారంలో రోడ్ల వెంట 800, పల్లెప్రకృతి వనంలో 3,800, సమీపంలోని ట్రస్టులో 800 మొక్కలను నాటారు. ప్రస్తుతం వైకుంఠ ధామంలో బయో ఫెన్సింగ్ మోడల్‌గా మూడు వరుసల్లో 2వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌లో నాటేందుకు ఇతర ప్రాంతం నుంచి 250 మొక్కలు కొనుగోలు చేశారు. శాంతి భద్రతల కోసం గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
గ్రామంలోజరిగిన అభివృద్ధి పనులు..
పల్లెప్రకృతిలో భాగంగా రూ.80లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి గత సంవత్సరం రూ.25 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ నిధులు రూ.20లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఎమ్మెల్సీ నిధులు రూ.9లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, జడ్పీటీసీ నిధులు రూ.2లక్షలతో వాటర్ ట్యాంకు రిపేర్, నూతనంగా రూ.12.60లక్షలతో అధునిక వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు షెడ్డును నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామంలో రూ.1.49కోట్లకు పైగా నిధులతో పనులు జరిగాయి.
అభివృద్ధే లక్ష్యం..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతిని పకడ్బందీగా అమలు చేస్తూ పాలకవర్గ సభ్యుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశాం. పల్లెప్రకృతి వనంతోపాటు ఇంటింటికీ ఐదు మొక్కలు పంపిణీ చేసి సంరక్షించేలా అవగాహన కల్పించాం. పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా చేపడుతూ స్వచ్ఛ గ్రామంగా మార్చుకుంటున్నాం.
-జక్క కవితారాఘవేందర్రెడ్డి, సర్పంచ్
ప్రణాళికతో పనులు చేపడుతున్నాం…
ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం వంటి అభివృద్ధి పనులను పూర్తి చేశాం. నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూ స్వచ్ఛ గ్రామంగా మార్చుకుంటున్నాం. డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తాం. వైకుంఠ ధామంతో పాటు డంపింగ్‌యార్డులో బయో ఫెన్సింగ్ మోడల్లో మూడు వరుసల్లో 2వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం.