
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సాగు, తాగునీటి ప్రాజెక్టులపై విషం కక్కడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. కాళేశ్వరం, భగీరథ ఫలితాలు కండ్ల ముందే కనిపిస్తున్నా.. అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. మిషన్ భగీరథ స్ఫూర్తితో కేంద్రం ‘హర్ ఘర్ జల్’ పేరుతో ఇంటింటికీ తాగునీటి నల్లా కనెక్షన్ పథకాన్ని కాపీ కొట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కమలం నేతల దిగుజారుడు రాజకీయాలకు ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
ఖమ్మం, జనవరి 5 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కొవిడ్ నిబంధనలను తొసిరాజని రాష్ట్రంలో పర్యటించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేయడంపై పలువురు టీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. జెపీ నడ్డా రాష్ర్టానికి వచ్చిన ప్రతిసారీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా కాపాడిందో, ఏ మేరకు నిధులు ఇచ్చిందో చెప్పకుండా ఊకదంపుడు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధిని నడ్డా గమనించకపోవడం విచారకరమన్నారు.
రాజకీయం కోసమే విమర్శలు: మంత్రి అజయ్
రాష్ట్ర ప్రభుత్వంపై నడ్డా చేసిన విమర్శలు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవని, రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేసిన విమర్శలుగానే ఉన్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అనేక రాష్ర్టాలను ఆలోచింపజేస్తున్న విషయాన్ని నడ్డా గమనించలేదనుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా ఉందని కేంద్ర మంత్రులు ప్రశంసించిన విషయాలను మరిచి ఇప్పుడు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే వాటిని విశ్యసించే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని గుర్తుచేశారు. కాళేశ్వరం నిర్మాణం పారదర్శకంగా జరిగిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే తెల్చిచెప్పిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. అయినా అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమంటే ప్రజాప్రభుత్వంపై ఆడిపోసుకోవడమే అవుతుందని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందుతున్నా.. తనకు తెలియనట్టుగా విమర్శలు చేయడం విడ్డురంగా ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో అవినీతి లేదని అనేకసార్లు కేంద్రం స్పష్టం చేసినా.. నడ్డా ఇప్పుడు మళ్లీ అవినీతి అక్రమాల ఆరోపణలు చేయడం ‘ఆత్మస్తుతి పరనింద’ మాత్రమే అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని, రాజకీయ లబ్ధి కోసమే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నడ్డా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని, అసలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి బీజేపీకి లేదని మంత్రి స్పష్టం చేశారు.
నడ్డావి దిగజారుడు వ్యాఖ్యలు: ఖమ్మం జడ్పీ చైర్మన్
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన ఆరోపణలు ఆయన స్థాయిని దిగజార్చే విధంగా ఉన్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విమర్శించారు. అడ్డగోలు వ్యాఖ్యలతో ఢిల్లీ నాయకుడి హోదాను గల్లీకి తగ్గించుకున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు నోరు పారేసుకుంటున్న తీరును ప్రజలు ఇప్పటికే అసహ్యించుకుంటున్నారని అన్నారు. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడే తెలంగాణ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసి ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చుకున్నారని అన్నారు. టీఆర్ఎస్పై ఆవాకులు చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
అభివృద్ధి కన్పించడం లేదా?: భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధి కన్పించడం లేదా? అంటూ భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ధ్వజమెత్తారు. కాళేశ్వరం, మిషన్ భగీరథపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అన్నదాతలను ఇతోధికంగా ఆదుకుంటున్న రైతుబంధు వంటి పథకాలు బీజేపీ నాయకులకు కన్పించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 317 జీవోపై పోరాటం చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది ఏ ప్రభుత్వమో తెలుసుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయాలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని సూచించారు.