
మామిళ్లగూడెం, జనవరి 7: ధరణి పోర్టర్లోని అన్ని మాడ్యూళ్లపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, పెండింగ్ దరఖాస్తులపై సత్వర పరిషార చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తహసీల్దార్లను ఆదేశించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లతో శుక్రవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ధరణి పెండింగ్ దరఖాస్తులు, జాతీయ రహదారుల భూసేకరణ, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కొవిడ్ పరిహారం పెండింగ్ దరఖాస్తులు, ఇతర రెవెన్యూ అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి మాడ్యూళ్లపై అవగాహన ఉంటే క్లెయిముల పరిషారం సులువుగా ఉంటుందని అన్నారు. జాతీయ రహదారుల భూసేకరణ మిగులు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కల్యాణలక్ష్మి దరఖాస్తులను, కొవిడ్ మృతుల పరిహారం దరఖాస్తులను త్వరగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు .
ఎన్ఆర్ఐల సేవలు అభినందనీయం..
ప్రవాస భారతీయులు తమ సొంత జిల్లాకు సేవలందించడం అభినందనీయమని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. ప్రవాసీ దివస్ సందర్భంగా శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా ప్రవాస భారతీయుల ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు, వైద్య ఆరోగ్య శాఖకు మెడికల్ కిట్లను ఫౌండేషన్ వితరణ చేయగా కలెక్టర్ వాటిని సంబంధిత అధికారులకు అందజేశారు. ఫౌండేషన్ బాధ్యులు బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.