
ఖమ్మం సిటీ, జనవరి 6: ఖమ్మంలో కండల వీరులు దిగారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 600 మంది సందడి చేశారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు. పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీతలు సైతం చేరుకోవడంతో స్తంభాద్రి పులకించిపోయింది. ఇంతకూ వారికి ఇక్కడేం పని! ఎందుకొచ్చారా అని ఆలోచిస్తున్నరా? అబ్బే అదేం లేదండీ.. శుక్రవారం నుంచి ఖమ్మంలో మిస్టర్ ఇండియా సీనియర్ జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగబోతున్నాయి. వీటిల్లో పాల్గొనేందుకు వందలాది మంది తరలిరాగా గురువారం జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించారు. అర్హతలు, శరీర బరువు ఆధారంగా మొత్తం 8 కేటగిరీల్లో 50 కేజీల విభాగం నుంచి 100 కేజీలు, ఆపై విభాగాల్లో నమోదు చేశారు. కాగా ప్రతిష్టాత్మక ఈవెంట్స్ నిర్వహించడంలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న ప్రముఖ న్యాయవాది, నేషనల్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు స్వామి రమేశ్ సారథ్యం వహిస్తున్నారు.
నేడు పోటీలు షురూ..
ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి సీనియర్ బాడీ బిల్డింగ్ పోటీలు మిస్టర్ ఇండియా-2022 ఛాంపియన్‌షిప్‌నకు ఖమ్మం వేదిక కాబోతున్నది. నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో రెండు రోజులపాటు (శుక్ర,శని) జరిగే ప్రతిష్ఠాత్మక పోటీలకుగాను దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన 500 నుంచి 600 మంది వరకు కండల వీరులు హాజరుకావడం విశేషం. టోర్నీలో భాగస్వాములయ్యేందుకు అర్జున అవార్డు గ్రహీత, పద్మశ్రీ ప్రేమ్‌చంద్ డోగ్రా, పీవీ ఫౌలీ, సుందరం భాస్కరన్ వంటి హేమాహేమీలు సైతం విచ్చేశారు. బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు నిమిత్తం ఖమ్మానికి చేరుకున్న వారందరికీ హోటల్స్‌లో వసతి కల్పించారు. ఎక్కడా రాజీపడకుండా ఒక్కొక్కరికి రోజుకు రూ.2,500 విలువచేసే భోజనాన్ని ఏర్పాటు చేశారు. మెనూలో 40 కోడి గుడ్లు, పావుకిలో కిస్మిస్, జ్యూస్ రెండు గ్లాసులు, వీట్ బ్రెడ్ ఒక ప్యాకెట్, వైట్ రైస్, ముద్ద పప్పు (ఉప్పు లేకుండా), 200 గ్రాముల చికెన్, అర కేజీ ఆలుగడ్డలు, వాటర్ బాటిల్, ఎండిన ఖర్జూరా పావుకిలో ఉన్నాయి. ఉత్తరాది నుంచి వచ్చిన బిల్డర్స్ ఖమ్మంలో ఏర్పాటు చేసిన భోజన వసతికి ముగ్ధులయ్యారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు స్వామి రమేశ్, అధ్యక్షుడు పీవీ ఫౌలీ, సెక్రటరీ హీరాలాల్, ప్రపంచ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ సెక్రటరీ చేతన్ పతార్ పర్యవేక్షిస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత, మంత్రి అజయ్ సహకారం..
హైదరాబాద్‌ను మినహాయిస్తే జాతీయ సీనియర్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించడం యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం ప్రథమస్థానాన్ని కైవసం చేసుకున్నది. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో నేడు ప్రిలిమినరీ, రేపు ఫైనల్స్ పోటీలు జరుగుతాయి. ఇదొక అద్భుతమైన అవకాశంగా భావించాలి. పోటీలకు ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి పువ్వాడ అజయ్ సహకారం అద్భుతం. అడిగిన వెంటనే అంగీకరించి వెన్నుదన్నుగా నిలిచారు.
-స్వామి రమేశ్, ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు
ప్రపంచ చాంపియన్‌గా నిలిచాను..
మాది పంజాబ్. జాతీయ, అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల్లో అనేకమార్లు పాల్గొన్నాను. 1983 నుంచి 1985 వరకు అంతర్జాతీయ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాను. నాకు 1986లో అర్జున అవార్డును ప్రదానం చేశారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాను. అందుకు కేంద్ర ప్రభుత్వం 1990లో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. జాతీయస్థాయి పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఖమ్మం ఎంతో బాగుంది. -పద్మశ్రీ ప్రేమ్‌చంద్ డోగ్రా