
సీఎం కేసీఆర్ అందిస్తున్న చేయూతతో తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. రికార్డు స్థాయిలో వరి దిగుబడులు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. తెలంగాణ రైతు సాధిస్తున్న అద్భుత ప్రగతిని చూసి కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయమని తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నది. కేంద్ర సర్కారు ఏమో యాసంగిలో పండించే ధాన్యాన్ని కొనమని చెబుతుంటే, ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం వరి సాగుచేయాలని రైతులకు పిలుపునిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తున్నది. కేంద్రం తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా.. తెలంగాణ రాష్ట్రంపై ఎందుకు ఈ వివక్ష.. అంటూ ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు కష్టం చేస్తేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తాయనదే బీజేపీ నాయకులు గుర్తించాలి. యాసంగి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా ..?లేదా..? అని సూటిగా సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తే ఇంత వరకు సమాధానం లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై అభండాలు వేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల పక్షాన ధాన్యం సేకరణపై ఢిల్లీకి రాష్ట్ర మంత్రుల బృందం వెళ్తే, మీకు ఏం పనిలేదా అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనడం ఎంత వరకు సమంజసం. ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ కేంద్ర మంత్రి తీరును రైతులు ఆసహ్యించుకుంటున్నారు.
తెలంగాణ బీజేపీ నేతలమో ఇలా..
యాసంగి ధాన్యం కొనమని కేంద్రం చెబుతుంటే, తెలంగాణలోని బీజేపీ నాయకులు మాత్రం వరి వేయాలని రైతులకు చెబుతున్నారు. వరి వేయండి అని చెబుతున్న తెలంగాణ బీజేపీ నాయకులు, రేపు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు వరి వేశాక రేపు రైతులు రోడ్ల మీద పోస్తే దానిని రాజకీయం చేయాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గ్రామాలకు వచ్చే బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని రైతు సంఘాల నాయకులు, రైతులు సిద్ధ్దమవుతున్నారు.
అయ్యో… ఈయనా మా ఎమ్మెల్యే..?
-దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తీరుపై స్థానిక రైతుల ఆగ్రహం
ఐకేపీ కేంద్రాలు లేకుంటే రైతులు ధాన్యం అమ్ముకోలేదా..? ఐకేపీ కేంద్రాలు ఉంటే ఏంది.. లేకపోతే ఏంది అని సిద్దిపేట జిల్లాకు చెందిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక నియోజకవర్గ రైతులతో పాటు జిల్లా రైతులు మండి పడుతున్నారు. ఇతనా.. మా ఎమ్మెల్యే అంటూ రైతులు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు. రైతుల పక్షాన పోరాటం చేయాల్సింది పోయి, రైతులకు నష్టం కలిగేలా మాట్లాడుతున్న ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే తీరును చూసి రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. “ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. రైతుల పక్షాన ఉంటా అంటివి, ఇప్పుడేమో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకుంటే ఏంది..ఉంటే ఏంది అనవడితివి. అయ్యా ఎమ్మెల్యే మా ధాన్యం యాడ అమ్ముకోవాలి. నీవు తీసుకుపోయి అమ్ముకస్తవా..యాసంగిలో వరి వేయమనవడితివి.. నిజంగా నీవు రైతుల పోక్షాన ఉంటే కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి యాసంగి ధాన్యం కొనుగోలుపై ప్రకటన చేయించు. ఇది చేత కాదు కాని ..నోటికి వచ్చినట్లు మాట్లాడుతావు. వానకాలం ధాన్యం కొనుగోలు చేయుమని చెప్పవడితివి.. వానకాలం ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది తెలియదా..? గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలియకుండా మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్. ఇప్పటికే వానకాలం ధాన్యం కొనుగోలు చివరి దశకు వచ్చింది. మీ దుబ్బాక నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియదా అంటూ..” రైతులు మండిపడుతున్నారు. యాసంగి ధాన్యం విషయంలో కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతుల నడ్డి ఇరుస్తున్న మోడీ..
రైతులు యాసంగిలో వరిని పండిత్తే మేము తీసుకోమని గిప్పుడూ ప్రధాని మోడీ జెప్పడంతో మా రైతులకు కట్టాలు తప్పవు. పొట్టజేత పట్టుకొని బతిరే రైతుల నడ్డి ఇరుస్తున్న గా బీజేపీ సర్కారుకు రైతుల ఉసురు తగులుతుంది. రైతుల కోసం ఢిల్లీలో బతిమిలాడుతున్న టీఆర్ఎస్ పార్టీ మంత్రులను బీజేపీ నేతలు ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు. రైతులు టీఆర్ఎస్ ఎంటే ఉంటాం. మా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మా ఓట్లతో గెలిచి రైతుల నోట్లో మట్టి కొడుతున్నావ్. నీకు తగిన బుద్ధి చెబుతం బిడ్డా.
-ర్యాకం నర్సింహులు, రైతు,మిరుదొడ్డి (సిద్దిపేట జిల్లా)
తెలంగాణ ప్రభుత్వ చేయూతతో గణనీయంగా పెరిగిన వరిసాగు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రైతులు అరిగోస పడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు కుదుట పడుతుండగా, వ్యవసాయ రంగాన్ని నీరు గార్చే కుట్రలకు బీజేపీ పాల్పడుతున్నది. సీఎం కేసీఆర్ పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన కరెంట్, రైతుబంధు సాయం అందిస్తుండడంతో రైతులకు చేయూత లభించి పుష్కలంగా పంటలు పండిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు నింపడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. రెండేండ్ల నుంచి భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. ఎవుసానికి మంచి రోజులు వచ్చాయని సంతోష పడుతున్న తెలంగాణ రైతులకు కేంద్రం తీరుతో నష్టం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ వానకాలంలో పండించిన మొత్తం ధాన్యం సేకరిస్తున్నది. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 3,77,657 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నది. కొన్న ఈ వడ్ల విలువ రూ.740 కోట్లు. ఇప్పటి వరకు రైతులకు రూ. 592 కోట్లు చెల్లించింది. 412 కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయగా, సేకరణ పూర్తయిన చోట కేంద్రాలను మూసి వేస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 198 కేంద్రా ల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వంద శాతం ధాన్యం సేకరణ పూర్తి చేసింది.
రఘునందన్‌రావు క్షమాపణ చెప్పాలి..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి కార్పొరేట్లకు మేలుచేసేలా వ్యవహరిస్తున్నది. జాతీయ రైతు దినోత్సవం ముందు రోజున ఢిల్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌రావు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు అవసరమా, రైతులు ఇష్టం వచ్చిన చోట అమ్ముకోరాదా అని మాట్లాడటం రైతుల డిమాండ్‌ను అవమానించేదిగా ఉంది. వర్షాకాలంలో ఐకేపీ, సహకార సంఘాలు, మార్కెట్ కమిటీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చూస్తుంటే, ఓర్వలేక బీజేపీ నాయకులు ఇబ్బందులు కలిగించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ముందు రైతులు దళారుల చేతిలో నలిగిపోయిన విషయం ఎమ్మెల్యేకు తెలియదా. ధాన్యం కేంద్రాలు బంద్ చేస్తే, కార్పొరేట్ పరం చేసి రైతును నష్టం చేయాలని బీజేపీ నాయకులు కోరుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత ఎమ్మెల్యే రఘునందన్‌రావు రాజకీయాలు మాట్లాడాలి. రాష్ట్ర బీజేపీ నాయకులకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్రంతో మాట్లాడి యాసంగిలో పారాబాయిల్డ్ రైస్ తీసుకుంటామని హామీ ఇప్పించాలి. రాష్ట్ర మంత్రులను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి గోయల్ వెంటనే క్షమాపణ చెప్పాలి.
-జీడిపల్లి రాంరెడ్డి , టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తొగుట (సిద్దిపేట జిల్లా)
రైతులను గోస పెడితే మంచిది కాదు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంట్ ఇస్తున్నడు. అందుబాటులో ఎరువులు,విత్తనాలు, ఇంకా అనేక సౌకర్యాలు రైతులకు కల్పించిండు. రైతుల బాగుండాలనే సీఎం కేసీఆర్ తాపత్రయ పడుతుండు. దీనికి తోడు వర్షాలు బాగా పడడంతో బీడు భూముల్లో ఇన్ని రోజులు నుంచి వరి సాగు చేస్తున్నాం. గిప్పుడు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొన అని చెప్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రైతులను గోస పెడితే కేంద్రానికి మంచిది కాదు.
-యాదగిరి, రైతు, నిజాంపేట (మెదక్ జిల్లా)
ధాన్యం కొనకపోతే మాగతి ఏంటి..
కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం తీసుకోకపోతే మాగతి ఏంటి. మా ఓట్లు కావాలి కాని మేము పండించిన వడ్లను ఎందుకు కొనరు. మాకు వరి పంటనే పండించడం తెలుసు. ఇప్పుడు వడ్లను కొనమంటే మేము ఏం అయిపోవాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులను, తెలంగాణ సర్కారును యాష్ట పెట్టకుండా వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పాలి. తెలంగాణ సర్కారు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో మాకు దళారీల బాధ తప్పింది. మళ్లీ దళారులతో మోసపోవడం మావల్ల కాదు.
-పుట్టి శ్రీనివాస్, రైతు, బ్రాహ్మణపల్లి, నర్సాపూర్ (మెదక్ జిల్లా)
కేంద్రానికి మరోసారి బుద్ధి చెప్పాల్సిందే..
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నది. తెలంగాణలో పండించిన ప్రతి గింజనూ కేంద్రం కచ్చితంగా కొని తీరాల్సిందే. ఇంతకు ముందు వ్యవసాయ నల్లచట్టాలు తీసుకువచ్చిన కేంద్రం, రైతుల ఆందోళనతో తోకముడిచింది. మరోసారి కేంద్రానికి రైతులు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. – బచ్చల శ్రీశైలం, రైతు, గురువన్నపేట (సిద్దిపేట జిల్లా)
బీజేపోళ్లు వంకర టింకరగా మాట్లాతుండ్రు..
చాలా ఏండ్ల సంది వరి పండిస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుం డా చూడాలి. ఎన్ని వడ్లు కొంటారో చెబితే రైతులు కూడా అంతే పండిస్తారు. రైతులకు ఇబ్బందులు పెడుతున్న కేంద్రం ప్రభుత్వం వారి ఆగ్రహానికి తప్పకుండా గురవుతుంది. తెలంగాణ రైతులపై ఢిల్లీ సర్కారు కక్ష కడుతున్నది. గందుకే బీజేపోళ్లు ఇలా వంకర టింకరగా మాట్లాడుతున్నరు.
-వీరారెడ్డి, పీచెర్యాగడి రైతు, కోహీర్ మండలం( సంగారెడ్డి జిల్లా)
కేంద్రం వైఖరి సరికాదు..
రైతన్న ఎక్కడ ఆనందంగా ఉంటడో ఆ రాజ్యం మాత్రమే సుభిక్షంగా ఉంటదన్నది అందరికీ తెలిసిన సత్యం. మరి ఇయ్యాల కేంద్రమేమో వడ్ల విషయంలో రైతన్నల పట్ల మొండివైఖరి చూపిస్తంది. ఇది మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా పోరాటం చేస్తనే ఉన్నది. కేంద్రం మొండివైఖరి విడిచి పంట కొనుగోలు విషయంలో సూటిగా జవాబు చెప్పాలి. రైతులను అన్యాయం చేయద్దు.
-నర్మెట్ట కాశీరాములు, రైతు, జాలపల్లి (సిద్దిపేట జిల్లా)
కేంద్రం తీరు సరిగ్గాలేదు
కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు. కేంద్రం వరివేయకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు గోదాముల్లోనే మూలుగుతున్నాయి. మేము పండించిన వడ్లను కేంద్రం కొనాలి. మోదీ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లే పడవు. రైతుబంధు, రైతుబీమా ఇస్తూ రైతుల్లో సీఎం కేసీఆర్ దేవుడయ్యాడు.
-కమ్మెట పోచిరెడ్డి, రైతు,తెల్లాపూర్ (సంగారెడ్డి జిల్లా)
రైతుల నోట్లో మట్టి కొట్టకు..
దుబ్బాక ఎలచ్చన్లో గెలిచినంక మా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎవుసం చేసే రైతులకు ఇంటికి రెండు ఎడ్లు, బండి, నాగలి ఇత్తానని చెప్పి గెలిచినంక ఇయ్యకుండా మోసంజేసిండు. రైతులు పండించిన వడ్లను ఐకేపీ కేంద్రాల్లోనే అమ్ముకోవాలా, ఎక్కడైనా రైతులు అమ్ముకుంటారని గియ్యాల అంటుండు. గిదేనా మా రైతులకు నువ్వు చేసేది. రైతుల గోస మీకు పట్టడం లేదు. రైతుల నోట్ల మట్టి కొట్టేందుకు పయత్నిస్తుండ్రు. – నక్క రాజయ్య, రైతు, మిరుదొడ్డి (సిద్దిపేట జిల్లా)