క్రిస్మస్ వేడుకను ఘనంగా జరుపుకునేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిని సైతం రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించనుండడంతో అందుకు తగిన సన్నాహాలు చేశారు.క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా మెదక్ చర్చి నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి వేడుకల్లో పాల్గొననున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపనున్నది. ప్రత్యేక దుకాణాలు, రంగుల రాట్నాలతో చర్చి ఆవరణ జాతరను తలపిస్తున్నది. వేడుకలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనదీప్తి తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. రంగురంగుల విద్యుద్దీపాల కాంతుల్లో మెరిసిపోతూ మెదక్ చర్చి పండుగ శోభను సంతరించుకున్నది. అలాగే జిల్లాలోని చర్చిలు వేడుకలకు ముస్తాబయ్యాయి.
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 24 : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక మెదక్ చర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోకరక్షకుడు ఏసుక్రీస్తు పుట్టిన రోజు వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహా దేవాలయం (సీఎస్ఐ చర్చి)లో శనివారం తెల్లవారుజాము నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ర్టాలు, ఇతర దేశాల నుంచి సైతం భక్తులు రానుండడంతో వేడుకలకు ఘనంగా నిర్వహించడానికి మెదక్ డయాసిస్ మిషనరీ ప్రతినిధులు, అధికార యంత్రాంగం వారం రోజులుగా ఏర్పాట్లను చేశారు. కాగా, నేటి తెల్లవారుజాము నుంచే చర్చి ద్వారాలను తెరిచి ఉంచుతారు. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరాధన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి బిషప్ రెవరెండ్ ఏసీ సాల్మన్‌రాజు ముఖ్య అతిథిగా హాజరై భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేస్తారు. 9.30 గంటల ప్రాంతంలో రెండో ఆరాధన అంతరం చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్ సుకుమార్ దైవ సందేశం చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాస్టర్లు భక్తులకు దీవెనలు అందజేస్తారు. ఇందుకోసం, సికింద్రాబాద్‌లోని వేద కళాశాల నుంచి గురువులు రానున్నారు. తొలి రోజు లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని డయాసిస్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.
కాంతులు విరజిమ్ముతున్న చర్చి
క్రిస్మస్ పండగ సందర్భంగా చర్చి ప్రతినిధులు దేవాలయ ప్రాంగణాన్ని, పరిసరాలను అందంగా అలంకరించారు. రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణతో చర్చి కొత్త కాంతులను విరజిమ్ముతోంది. ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, నక్షత్రాలతో మహాదేవాలయం కొత్త శోభను సంతరించుకుంది.
వసతి సౌకర్యాలు
చర్చికి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం వసతి గృహాల మేనేజర్ జాయ్‌ముర్రే అధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వెస్లీ కళాశాల, గోల్ బంగ్లా, సండే స్కూల్, బిషప్ బంగ్లా, పర్యాటక అతిథి గృహంతో పాటు సీఎస్ఐ వసతి గృహాలను సిద్ధం చేశారు. తాగునీటి ఎద్దడి రాకుండా చర్చి పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నీటి ట్యాంకులను అందుబాటులో ఉంచారు. అత్యవసర వైద్య సేవల కోసం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ప్రత్యేక బస్సులు…
-మెదక్ డిపో మేనేజర్ ప్రణీత్‌కుమార్
జిల్లాలోని పలుప్రాంతాల నుంచి మెదక్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతాం. సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్, ఎల్లారెడ్డి, నర్సపూర్, బొడ్మట్‌పల్లి నుంచి మరికొన్ని బస్సులు నడుపుతాం. అంతేకాకుండా, ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భక్తులు చర్చికి వస్తారో గుర్తించి ఆ రూట్లలో బస్సులు అందుబాటులో ఉండేలా చూస్తాం.
పటిష్ట బందోబస్తు : మెదక్ ఎస్పీ చందనదీప్తి
మెదక్ క్రిస్మస్ పండుగ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు మెదక్ ఎస్పీ చందనదీప్తి తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మెదక్ చర్చిని చూసేందుకు, ప్రార్థనల్లో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, భక్తులకు ఆటంకం కలుగకుండా, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా, మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మొత్తం ఐదు సెక్టార్లను ఏర్పాటు చేసి, ముగ్గురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 51 ఎస్ఐలు, 56 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 100 కానిస్టేబుళ్లు, 50 మహిళా కానిస్టేబుళ్లు, 119 హోంగార్డులు, 8 అక్సెస్ కంట్రోల్ టీంలు, నాలుగు డే బైనాక్యులర్ టీంలు, స్పెషల్ పార్టీలు, ఏఆర్ సిబ్బంది కలిపి మొత్తం దాదాపు 500 మందితో బందోబస్తు విధులు నిర్వహించనున్నట్టు ఎస్పీ తెలిపారు.
జాతర బందోబస్తును సీసీ కెమెరాల ద్వారా నిఘా..
జాతర బందోబస్తులో భాగంగా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. అలాగే, జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని సూచించారు. చిన్న పిల్లలు తప్పిపోతే చర్చి ప్రాంగణంలోని పోలీసు కంట్రోల్ రూంలో వివరాలు తెలపాలని, అనుమానితంగా ఉండే వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే, బీడీ టీం, డాగ్ స్కాడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రత విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు పాటించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ చందనదీప్తి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ సైదులు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, మెద క్, తూప్రాన్ సబ్ డివిజన్ల సీఐలు, ఎస్ఐలు, జిల్లా ఏఆర్ సిబ్బంది, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి సిబ్బంది ఉన్నారు.
ఉదయం 4 గంటల నుంచి ..
-చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రెవరెండ్ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్
తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరాధన శిలువ ఊరేగింపుతో ప్రారంభమవుతుంది. అనంతరం బిషప్ సాల్మన్‌రాజ్ వాక్యోపదేశం చేస్తారు. రెండవ ఆరాధన ఉదయం 9.30 గంటలకు చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి దైవ సందేశం చేస్తారు. భక్తులకు దీవెనలిచ్చేందుకు పాస్టర్లు విజయకుమార్, దయానంద్, రాజశేఖర్, డేవిడ్, సువర్ణలతో పాటు హైదరాబాద్ వేద కళాశాలకు చెందిన పలువురు పాస్టర్లు అందుబాటులో ఉంటారు. సీఎస్ఐ పరిధిలోని కళాశాలలు, హాస్టల్స్, వసతి గృహాలను భక్తుల సౌకర్యార్థం సిద్ధంగా ఉంచాం. క్రిస్మస్ తర్వాత మరో రెండు రోజులు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.
కిస్మస్ శుభాకాంక్షలు
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట, డిసెంబర్ 24 : ఏస్తుక్రీస్తు ప్రవచించిన జాలి, దయ, కరుణ, ప్రేమ ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యాఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువు ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగకు కానుకలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాగే, ఎమ్మె ల్సీ శేరిసుభాష్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి,సిద్దిపేట సీపీ జోయెల్ డెవిడ్ క్రైస్తవులకు పండు గ శుభాకాంక్షలు తెలిపారు.