
సంగారెడ్డి, ఆగస్టు 8 : అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ రఘురాం ఆదేశాలతో అధికారులు పలు ప్రాం తాల్లో దాడులు నిర్వహించి, మద్యాన్ని స్వాధీనం చేసుకుని, పలువురు వ్యక్తలను అరెస్టు చేశారు. స్థానికుల సమాచారం మేరకు శనివారం సాయంత్రం మెదక్ డివిజన్ అధికారుల బృందం సంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నుంచి కొందరు అక్రమంగా మద్యం సరఫరా చేస్తుండడంతో కల్హేర్ మండల కేంద్రంలో రూ.20వేల విలువ చేసే మద్యం బాటిళ్లు, మోటర్ బైక్ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పుల్కల్ మండలం గొంగ్లూర్ గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న (234) లీటర్ల అక్రమ కల్లును పారబోసి విక్రయిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశారు. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో డిఫెన్స్ లిక్కర్ అమ్ముతున్నట్లు పక్కా సమాచారం రావడంతో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. స్కూటీని తనిఖీ చేయగా, తొమ్మిది బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమో దు చేశారు. కల్హేర్ మండల కేంద్రం, అన్నారం గ్రామం లో దొరికిన అక్రమ మద్యం అముతున్న వ్యక్తులను విచారించేందుకు ఆయా ఎక్సైజ్ స్టేషన్లకు తరలించామని అధికారులు వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాలు, పట్టణ శివారుల్లో మత్తు పదార్థాలు, అక్రమంగా మద్యం, గంజాయి అమ్మితే పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ రఘురాం హెచ్చరించారు. కళాశాలలకు చెందిన విద్యార్థులను అసరాగా చేసుకుని తమ వ్యాపారాలను విస్తరిస్తూ లాభాలు గడిస్తున్న వ్యక్తులపై సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పట్టణ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని, ఇటీవల సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో విక్రేతలను పట్టుకుని అరెస్టు చేశామన్నారు.