చొప్పదండి, డిసెంబర్ 28: అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పెడుతున్న పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈవో ప్రియాంక సూచించారు. మండలంలోని కొలిమికుంట అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రోత్ మానిటరింగ్ డే నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం పెడుతున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు ఆకుకూరలు, గుడ్లు, పోషకాహారం తీసుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా జన్మిస్తారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించాలని టీచర్లకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, ఎంపీటీసీ తోట కోటేశ్, తహసీల్దార్ రజిత, ఐసీడీఎస్ పీడీ పద్మావతి, సీడీపీవో కస్తూరి, ఎంపీడీవో స్వప్న, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఉపసర్పంచ్ సత్తు తిరుపతి, నాయకుడు మాచర్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారంతోనే ఆరోగ్యం
గంగాధర, డిసెంబర్ 28: పోషకాహారంతోనే ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ మేచినేని నవీన్‌రావు సూచించారు. మండలంలోని కురిక్యాల అంగన్వాడీ కేంద్రంలో గ్రోత్ మానిటరింగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రానికి వస్తున్న చిన్నారుల ఎత్తు కొలిచి బరువు తూకం వేశారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వెంకటలక్ష్మి, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.