
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 281 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత సీజన్లో కరోనా పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించగా, ఈసారీ అదే రీతిన అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నది. ఈ వానకాలం రికార్డు స్థాయిలో
వరి సాగవ్వగా, దిగుబడులు సైతం అందుకు తగ్గట్టుగానే వస్తున్నాయి. వరి కోతలు ముమ్మరంగా సాగుతుండడంతో రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు యాదాద్రి జిల్లావ్యాప్తంగా 1,46,047 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు సాగాయి. ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన రైతులకు రూ.22కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం రైతులను కష్టాల పాల్జేస్తున్నప్పటికీ, సీఎం కేసీఆర్ రైతుల పట్ల కనబరుస్తున్న శ్రద్ధను చూసి అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రెండేండ్లుగా రైతన్నలను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు దిగాలు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లోనూ అండగా ఉంటున్నది. గతంలో రైతన్న కష్టాన్నంతా దళారులే సొమ్ము చేసుకోగా.. ఆ ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కేసీఆర్ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరిగేలా ఏర్పాట్లు చేశారు. గత సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినప్పటికీ ప్రభుత్వం చివరి గింజ వరకూ కొని రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. ఈసారి కూడా వానకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో యాదాద్రి భువ నగిరి జిల్లాలో 281 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించి ధాన్యం కొంటున్నారు. ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఫలితంగా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది.
అధికారుల నిరంతర పర్యవేక్షణ..
యాదాద్రి జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. ఆయా శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రతి రోజూ సమీక్షలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం తూకం మొదలు.. మిల్లుల్లో దిగుమతి చేసే వరకూ పర్యవేక్షణ ఉంటుండడంతో రైతులకు ఇబ్బందులు కలుగడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల జాప్యం నెలకొంటుండగా.. చివరి గింజ వరకూ ప్రభుత్వం కొంటుందని చెప్పి రైతులకు ధైర్యం కల్పిస్తున్నారు. అకాల వర్షాలకు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. రవాణా పరమైన ఇబ్బందులను తీర్చేందుకు సత్వరం చర్యలు తీసుకుంటున్నారు. రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతుల సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. గత యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ తరలింపులో ఎఫ్‌సీఐ తాత్సారం చేస్తున్నప్పటికీ.. ఆ ప్రభావం వానకాలం ధాన్యం కొనుగోళ్లపై పడకుండా మిల్లర్లు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు. 1,46,047 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా ఇప్పటికే 1,35,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు తరలించారు. రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపుతుండడంతో కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి.
రికార్డు స్థాయిలో కొనుగోళ్లు
వానకాలం ధాన్యానికి సంబంధించి 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్తుండడంతో.. కేంద్రాలు ప్రారంభించిన నాటి నుంచి లక్ష్యానికి మించి కొనుగోళ్లు జరుగుతున్నాయి. వానకాలం దిగుబడులు బాగా ఉన్న నేపథ్యంలో కేంద్రాలకు భారీగా ధాన్యం తరలివస్తుండగా.. అదే స్థాయిలో కొనుగోళ్లు సైతం జరుగుతున్నాయి. నిత్యం 8-9వేల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన 281 కొనుగోలు కేంద్రాల్లో 14,678 మంది రైతుల నుంచి 1,46,047 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించి ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన వాటికి సంబంధించి రూ.22కోట్లను అధికారులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా డబ్బులను త్వరలోనే జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. వారం, పది రోజుల్లోనే డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండడంతో రైతులు సంబురపడి పోతున్నారు.