వెన్నుతట్టి ప్రోత్సహిస్తే వేల సమస్యలకు పరిష్కారం చూపుతామంటున్నాయి చిట్టి బుర్రలు. అనడమే కాదు, సృజనాత్మకంగా ఆచరణలో పెడుతున్నాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక వనరులను అందిపుచ్చుకుని వినూత్న ఆవిష్కరణలకు రూపమిస్తున్నాయి. ఇన్స్పైర్ మానక్ 2020-21కు జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన 9 ప్రాజెక్టులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. ఔరా! అనిపిస్తున్నాయి. వచ్చే నెల లేదా జనవరిలో రాష్ట్రస్థాయి ప్రదర్శన ఉండగా, జాతీయ స్థాయికి ఎంపికైన ఎగ్జిబిట్లను స్టార్టప్‌లుగా అభివృద్ధి చేసేందుకూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులకు తుదిరూపునిచ్చి, ఉత్పత్తులుగా మార్చి పేటెంట్ సైతం కల్పించనున్నది.
‘నేను ట్రెండ్ ఫాలో కాను.. ట్రెండ్ సెట్ చేస్తా’. ఇది ఒక సినిమాలోని డైలాగ్. అచ్చం అలాగే విద్యార్థులు అబ్బురపరిచే ఎన్నో కొత్త ఆవిష్కరణలకు రూపమిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా వీరు రూపొందించిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను ప్రోత్సహించేలా కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌తో కలిసి కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం అమలు చేస్తున్న ‘ఇన్స్పైర్ అవార్డ్స్- మానక్’ కు 2020-21 సంవత్సరానికి జిల్లా నుంచి తొమ్మిది ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీటిని ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరిలో రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించనున్నారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థుల ప్రదర్శనలు ఆన్లైన్లోనే పంపేలా ఏర్పాట్లు చేశారు.
ఒక్క అవకాశం ఇచ్చి.. కొంత ప్రోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభ నేటి చిన్నారుల సొంతం. చిన్ని మెదడు ఎన్నో ఆలోచనలకు.. సృజనలకు సమూహారంగా నిలుస్తుండగా.. ఇన్స్పైర్ ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు రూపొదించిన నమూనాలు ఔరా! అనిపిస్తున్నాయి. అయితే విద్యార్థుల ఆవిష్కరణలు ప్రదర్శనకే పరిమితమవుతుండడంతో తాజాగా.. తీసుకున్న నిర్ణయంతో ఇకపై జాతీయ స్థాయికి ఎంపికైన ఉత్తమ ఎగ్జిబిట్లను స్టార్టప్‌లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌లకు తుది రూపునిచ్చి, ఉత్పత్తులుగా మార్చి పేటెంట్ హక్కులను పొందే అవకాశాన్ని సైతం కల్పిస్తున్నారు. జిల్లా నుంచి మొత్తం 88 ప్రాజెక్టులకు గాను 9 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. రాష్ట్ర స్ధాయికి ఎంపికయిన విద్యార్థులు, ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి.
బహుళ ప్రయోజనం
సౌండ్ టు లైట్, లైట్ టు సౌండ్. నీటిలో మునిగిన వస్తువుల దూరాన్ని గుర్తించడానికి ఈ పరికరం ఉపయోపపడుతుంది. మైక్రోఫోన్స్, కంప్యూటర్ చిప్స్‌తో ఎలక్ట్రానిక్ వస్తువుల మందాన్ని తెలుసుకునేందుకు ఉపయోగిస్తారు. పేలుడు పదార్థాలు, కొత్తరకం ఆయుధాలను గుర్తించేందుకు, రక్షణకు ఈ పరికరం ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా యానిమేటెడ్ వీడియోల ద్వారా విద్యార్థులకు సైన్స్ పాఠాలు అర్థమయ్యేలా బోధించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
వాహన డ్రైవర్లకు అలర్ట్
వాహనాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు టైర్లలో ఉన్న గాలి తగ్గిపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవశాశం ఉంటుంది. వాటిని నివారించేందుకు ఈ పరికరం ఉపయోగపడనుంది. ఈ పరికరాన్ని వాహనానికి ఉన్న టైర్లకు అమర్చడం వల్ల డ్రైవర్‌కు వెంటనే ప్రత్యేక అలారం ద్వారా గానీ లేదా సెల్‌ఫోన్‌కు సమాచారం అందించడం చేస్తుంది. దానితో ప్రమాదాలు నివారించవచ్చు.
ఎత్తులు, దూరాల గుర్తింపు
ఈ పరికరం దూరంగా ఉన్న వస్తువులను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఇది క్లీనో మీటర్ సూత్రంపై అధారపడి పని చేస్తుంది. ఈ సూత్రం ఆధారంగానే పర్వతాల దూరాలను గుర్తించడం జరిగింది. మనం చేరుకోలేని ప్రాంతాల ఎత్తులను, దూరాలను దీని సాయంతో కనుగొనొచ్చు.
మల్టీ వర్కింగ్ అగ్రికల్చరల్ మిషన్
విత్తనాలు వేయడం, మట్టని కప్పడం, విత్తనాలకు నీటిని అందించడం వంటి పనులను చేస్తుంది. ముందు భాగంలో అడ్డంగా అమర్చిన పైపుకు 2 నాగళ్లను అమర్చుతారు. ఇది భూమిని దున్నుతుంది. పైన ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పాత్రలో ఉన్న విత్తనాలు పైపుల ద్వారా దున్నిన సాళ్లలో పడేటట్లు ఏర్పాటు. దీని వెనకాల అడ్డంగా అమర్చిన పైపుకు ఒక రేకును అమర్చడంతో ఆ రేకు వెనుకాల ఉన్న మట్టిని విత్తనాలపై కప్పుతుంది. తర్వాత పైన ఏర్పాటు చేసిన ట్రేలో ఉన్న నీరు స్లైన్ పైపుల ద్వారా విత్తనాలకు అందే విధంగా ఏర్పాటు. ఖర్చు తక్కువ, ఒకరితోనే ఇది పని చేస్తుంది. అన్ని పనులు ఒకేసారి జరుగుతాయి.
తక్కువ సమయంలో ఎక్కువ విత్తనాలు వేయొచ్చు
వ్యవసాయంలో విత్తనాలను వేసేందుకు ఈ పరికరం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విత్తనాలు విత్తుకోవచ్చు. మనం ప్రతి రోజు ఉపయోగించే సైకిల్‌ను కొంత మార్చడం ద్వారా పరికరాన్ని తయారు చేసుకునే అవకాశం. తక్కువ మందితో ఈ యంత్రం పని చేస్తుంది.
ప్రమాదాలపై ముందుస్తు హెచ్చరిక
మాట్లాడలేని వారికి చికిత్స అందించేందుకుగాను ఈ పరికరం ఉపయోగపడుతుంది. పులుల నుంచి జింకలను కాపాడేందుకు ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. పులి వచ్చే సమయంలో జింకలకు సమాచారం ఇచ్చేందుకు కోతి అరిచినట్లుగా అరిచే విధంగా దీనిని అమరుస్తారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాల సమయంలో హెచ్చరికలు చేస్తుంది. ఓడల రాకను గుర్తించేందుకు ఉపయుక్తం.