
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే.. అన్నీ తమకు అని ఆనందించే పిల్లల భవిత అంధకారం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. నాఅన్నవారు లేని, ఉన్నా ఇంటికి దూరమైన పిల్లలను చేరదీస్తున్నది. ఆపరేషన్ స్మైల్ ద్వారా ఇప్పటికే 972 మంది పిల్లలకు భరోసా కల్పించగా, తాజాగా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎనిమిదో విడుతను మొదలుపెట్టింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్న అధికారయంత్రాంగం.. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే సమాచారమిచ్చి పిల్లల బంగారు భవితకు బాటలు వేయాలని కోరుతున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో
ఆపరేషన్ స్మైల్ -8 కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా పరిరక్షణ విభాగం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ వారీగా సబ్ ఇన్స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లు (ఒక స్త్రీ, ముగ్గురు పురుషులు), జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జోన్ పోలీస్ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది.
అనేక మంది బాలలకు విముక్తి
ఆపరేషన్ ముస్కాన్ 2015లో ప్రారంభించారు. జిల్లాల పునర్విభజన కాకముందు భువనగిరి డివిజన్ పరిధిలో 2015-16 సంవత్సరానికి గాను 118 మంది పిల్లలను గుర్తించి వారిని వెట్టి నుంచి విముక్తి కల్పించారు. జిల్లాల పునర్విభజన అనంతరం 2017నుంచి ఆపరేషన్ ముస్కాన్(ఆపరేషన్ స్మైల్)ను చేపడుతున్నారు. ఆపరేషన్ స్మైల్‌ను జనవరి 1 నుంచి 31 వరకు, ఆపరేషన్ ముస్కాన్‌ను జూలై 1 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. తప్పిపోయిన చిన్నారులు, బాలకార్మికులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద భిక్షాటన చేస్తున్న చిన్నారులతో పాటు ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఫ్యాక్టరీలు, కిరాణా షాపులు, దాబాలు, హోటల్స్‌లో వెట్టిచాకిరీ చేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న చిన్నారులను గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మరికొందరికి వివిధ స్వచ్ఛంద సంస్థల్లో ఆశ్రయం కల్పించారు. ఇలా 2017 నుంచి ఇప్పటి వరకు భువనగిరి డివిజన్లో మొత్తం 942 మంది బాలబాలికలను గుర్తించి పనిభారం నుంచి విముక్తులను చేశారు.
కేసులు నమోదు
బాల కార్మిక చట్టం ప్రకారం చిన్నారులను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తు న్నారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆపరేషన్ స్మైల్-8 ప్రారంభమైంది. నెల రోజుల పాటు నిర్వహించే కార్యాచరణను పోలీస్, కార్మిక, విద్యా, మహిళాశిశు సంక్షేమ, రెవెన్యూశాఖల భాగస్వా మ్యంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం రూపొందించింది.
సమాచారం అందించండి
బస్టాండ్లు, రైల్వేస్టేషన్, ఫ్యాక్టరీలు, కిరాణా దుకాణాలు, దాబాలు, హోటళ్లు, అన్ని రకాల వ్యాపార సంస్థల్లో చిన్నారులు పని చేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా బాలల పరిరక్షణ సమితి వారికి సమాచారం అందించాలి. వారు అక్కడికి వెళ్లి చిన్నారులను వెట్టినుంచి విముక్తి చేసి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తారు. యాదాద్రి భువనగిరి జోన్లో ఆపరేషన్ స్మైల్-8 ప్రారంభమైంది.
అన్ని శాఖల సమన్వయంతో
ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నాం. 18 సంవత్సరాలలోపు పిల్లలతో పని చేయించడం చట్టప్రకారం నేరం. పిల్లలతో పని చేయించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ బాలల హక్కులను పరిరక్షించాలి.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, వెట్టిలో మగ్గుతున్న బడీడు పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించడమే ఆపరేషన్ స్మైల్ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 2015 జూలైలో ప్రారంభమైన కార్యక్రమం పసి తనంలోనే పనిభారాన్ని మోస్తున్న చిన్నారుల మోముల్లో చిరునవ్వు పూయిస్తోంది.