
నార్కట్‌పల్లి, జనవరి 2 : తనకు మిగిలిన ఏకైక ఆస్తి ఇంటిని గ్రంథాలయంగా మార్చిన గొప్ప మనిషి కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు పెందోట సోమయ్య అధ్యక్షతన పట్టణ కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూరెళ్ల అందరివాడని, ఆయ న సేవలు మనందరికీ అవసరమని అన్నారు. పెన్షన్ డబ్బులతో మహా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి లక్షల పుస్తకాలు సేకరించిన మహోన్నత వ్యక్తి విఠలాచార్య అని కొనియాడారు. చిన్నతనం నుంచే అనేక కష్టాలను చూసిన వ్యక్తి ఏడేళ్ల ప్రాయంలోనే రచనలు చేయడం ఆయనకున్న పట్టుదలకు నిదర్శనమన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక సాహితీ, విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఆయన సహకారంతో అనేక మంది విద్యార్థులు పైకెదిగి ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్నారని తెలిపారు.
సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలకు మరెన్నో అవార్డులు రావాలన్నారు. అనంతరం కూరెళ్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, దాసోజు యాదగిరి, కాసో జు విశ్వనాథం, బైరోజు సత్యనారాయణ, శ్రీనివాస్, షణ్ముఖాచారి, బ్రహ్మచారి, రమేశ్, కృష్ణమాచారి, పుష్పగిరి, సత్యనారాయణ, లక్ష్మయ్య, జ్ఞానేశ్వర్, ఓంప్రకాశ్, ఉపేంద్రాచారి, మహేందర్, నవీన్‌కుమార్, మల్లాచారి, సత్యనారాయణ పాల్గొన్నారు.
నియోజవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.10.56కోట్లు మంజూరు
కట్టంగూర్(నకిరేకల్) : నియోజవర్గంలో కొత్తగా రోడ్ల నిర్మాణంతో పాటు, పాత రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వంరూ.10.56కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిధుల మంజూరు వివరాలు వెల్లడించారు. నకిరేకల్‌లోని మూసీ రోడ్డు మరమ్మతుకు రూ.కోటి, నకిరేకల్-తిప్పర్తి రోడ్డు మరమ్మతుకు రూ.66లక్షలు, నార్కట్‌పల్లి టౌన్ పోర్షన్ మరమ్మతుకు రూ.83లక్షలు, కట్టంగూర్ మండలం కల్మెర- షాపల్లి రోడ్డు మరమ్మతుకు రూ.1.50కోట్లు, కట్టంగూర్-ఈదులూరు సీసీరోడ్డు నిర్మాణానికి రూ.1.52కోట్లు, చిట్యాల-మునుగోడు రోడ్డుపై ఉరుమడ్ల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.80లక్షలు, నక్కలపల్లి-తొండల్వాయి రోడ్డు నిర్మాణానికి రూ.1.55కోట్లు, షాపల్లి-పరడ రోడ్డు గడ్డమీదిబాయి రోడ్డుకు రూ.1.20కోట్లు, రామన్నపేట-ఇప్పర్తి రోడ్డు మరమ్మతుకు రూ.1.50కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. మరో రూ.22కోట్లు రోడ్లు, నకిరేకల్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ ఏర్పాటుకు రూ.24కోట్లు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, మినీ స్టేడియం ఏర్పాటుకు రూ.20 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నియోజవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, నార్కట్‌పల్లి-నల్లగొండ హైవేపై గల 60ఎకరాల ప్రభుత్వ స్థలం వివరాలు మంత్రి జగదీశ్‌రెడ్డి ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.