
ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్16: అట్టడుగు వర్గాల బతుకు చిత్రమే వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు వచన కవిత్వం అని కాకతీయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య తాటికొండ రమేశ్ అన్నారు. కుందుర్తి శత జయంతి సందర్భంగా గురువారం ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ తెలుగు విభాగ ప్రిన్సిపాల్ మహ్మద్ జాకీరుల్లా అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. కుందుర్తి కవిత్వంలో అనేక ప్రయోగాలు చేశారన్నారు. ఆయన సాహిత్యం నయగార జలపాతంలా ఉంటుందన్నారు. విశ్వ మానవతావాదం ఆయన కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రముఖ కవి, సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. సమాజ హితం కోసం కుందుర్తి కవిత్వం రాశారన్నారు. నేటి సమాజం కుందుర్తి రచనలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బన్న అయిలయ్య మాట్లాడుతూ.. కుందుర్తి ప్రజల భాషనే కవిత్వంగా రాశారన్నారు. వచన కవిత్వాన్ని స్థిర పరచడానికి ఊరూరా తిరిగారన్నారు. కేయూ తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వచన కవిత్వం స్థిరపడడానికి కుందుర్తి సేవలే కారణమన్నారు. సాహిత్య అకాడమీ సభ్యుడు, కవి శిఖామణి మాట్లాడుతూ.. కుందుర్తిపై సదస్సు నిర్వహణ అభిలషనీయమన్నారు. వచన కవిత్వంలో వివిధ సాహిత్య రూపాలను తీసుకరావడానికి ఆయన కృషి చేశారన్నారు. ప్రముఖ కవి యాకూబ్, తెలుగు కళాశాల అధ్యాపకుడు డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ సదస్సుల నిర్వహణ అభినందనీయమన్నారు. అనంతరం లెప్ట్నెంట్, డాక్టర్ జరుపుల రమేశ్ రచించిన ‘రెప్పవాల్చని కాలం’ పుస్తకాన్ని, ‘కవి సంధ్య’ మాసపత్రికను ఆవిష్కరించారు. సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి, కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ సీతారాం రెండు రోజుల పత్ర విశేషాలను తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నాళేశ్వరం, శంకరం, వేణుగోపాల్, బెంగళూరు విశ్వ విద్యాలయ ఆచార్యులు ఆశాజ్యోతి, తెలంగాణ విశ్వ విద్యాలయ ఆచార్యులు డాక్టర్ చాలం శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.