
చుంచుపల్లి, డిసెంబర్ 9: ఐదు క్వింటాళ్లు. కోటి రూపాయలు. గంజాయి లెక్క ఇది. 524 కేజీల 400 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.1,04,88,000. చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు వెల్లడించిన వివరాలు… బుధవారం మధ్యా హ్నం 2.00 గంటల సమయంలో చుంచుపల్లి ఎస్సై, సిబ్బంది కలిసి స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఖమ్మం వైపు వెళ్తున్న ఓ లారీపై పోలీసుల దృష్టి పడింది. ఏదో తేడాగా అనిపించింది. వెంటనే ఆ లారీ (ఆర్జే 06 జీఏ 3950) ఆపారు. చింత పండు బస్తాల లోడ్ ఉంది. లారీలోని ఇద్దరు డ్రైవర్ల తీరు కూడా అనుమానాస్పదంగా అనిపించింది. ఆ బస్తాలన్నీ తీయి ంచా రు. పోలీసుల అనుమానమే నిజమైంది. ఆ చింతపండు బస్తాల కింద మొత్తం 20 ప్లాస్టిక్ బస్తాల్లో 524 కేజీల 400 గ్రాముల గంజాయిని దాచిపెట్టారు. దీని విలువ రూ. 1,04,88,000. ఆ ఇద్దరు డ్రైవర్లను పోలీసులు ప్రశ్నించారు. మొత్తం వివరాలను వారు బయటపెట్టారు.
జగ్దల్పూర్ నుంచి చిత్రకొండ మీదుగా…
ఆ ఇద్దరూ.. నారాయణ తేలి, బైరు లాల్ గుర్జార్. రాజస్థాన్ రాష్ట్రం బిల్వార్ జిల్లా బెనారా తహసీల్ పరిధిలోని ముసి గ్రామస్తులు. ఈ ఇద్దరు డ్రైవర్లు, అప్పుడప్పుడు మరో యజమాని (రైస్ ఖాన్) లారీపై కూడా వెళ్తుంటారు. ఆ రైస్ ఖాన్ వద్ద పనిచేస్తున్నప్పుడు అతని ద్వారానే, నాలుగు నెలల క్రితం పురం గుర్జార్ అనే గంజాయి వ్యాపారి పరిచయమయ్యాడు. వీరంతా కలిసి రాయపూర్‌లో బట్టల లోడ్ దించి, అక్కడి నుంచి జగ్దల్పూర్కు వెళ్లి చింతపండు లోడ్ చేసుకునేవారు. అడుగున గంజాయి బస్తాలు దాచిపెట్టేవారు. అక్కడి నుంచి ఆ గంజాయి వ్యాపారి (పురం గుర్జార్) చెప్పిన రూట్లో వెళ్లేవారు. ఇప్పుడు కూడా ఇలాగే చేశారు. చింతపండు బస్తాల లోడుతో ఒడిశా సరిహద్దులోని చిత్రకొండ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ముఖ్ష్ అనే వ్యక్తి నుంచి గంజాయిని తీసుకుని, చింతపండు బస్తాల కింద దాచారు. చుంచుపల్లి వద్ద పోలీసులకు చిక్కారు. పట్టుబడిన గంజాయిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్లు నారాయణ తేలి, బైరు లాల్ గుర్జార్‌ను అరెస్ట్ చేశారు. ఈ గంజాయి రవాణాతో సంబంధమున్న పురం గుర్జార్, ముఖేష్, రైస్ ఖాన్ పరారీలో ఉన్నారు.