
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం ఖమ్మం నగరంలోని జిల్లా పంచాయతీరాజ్ వనరుల కేంద్రం (డీపీఆర్సీ) భవనంలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. కల్టెకర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ పోలింగ్ అధికారులు, సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. శుక్రవారం నాలుగు కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. ఈ ఎన్నికలో 767 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కొవిడ్ నేపథ్యంలో రెండు డోసులు టీకా తీసుకున్నవారిని మాత్రమే పోలింగ్ సిబ్బందిగా నియమించారు. ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల కేంద్రంలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా 1,015 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
ఖమ్మం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పట్టిమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో గురువారం విలేకరుల సమావేశంలో ఎన్నికల ఏర్పాట్ల గురించి గౌతమ్ మాట్లాడారు. శుక్రవారం జరుగనున్న పోలింగ్‌లో ఉమ్మడి జిల్లాలోని 767 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ఇందుకోసం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయ పోలింగ్ కేంద్రంలో 84 మంది, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయ పోలింగ్ కేంద్రంలో 221 మంది, కల్లూరు ఆర్డీవో కార్యాలయ పోలింగ్ కేంద్రంలో 115 మంది, ఖమ్మం ఆర్డీవో కార్యాలయ పోలింగ్ కేంద్రంలో 348 మంది ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకుంటారని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారితోపాటు ఇద్దరు ఓపీవోలను నియమించినట్లు తెలిపారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిన పోలింగ్ జరుగునున్నందున 900 బ్యాలెట్ పేపర్లు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి అందాయని, వాటిలో 9 బ్యాలెట్ పేపర్లను డిఫెక్టివ్‌గా గుర్తించామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలెట్ బాక్సులను కేటాయించామన్నారు. డీపీఆర్సీ భవనంలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రంతోపాటు స్ట్రాంగ్ రూం ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది సామగ్రి రవాణా కోసం నాలుగు రూట్లను గుర్తించి ప్రతి రూటుకూ ఒక వాహనాన్ని కేటాయించినట్లు వివరించారు. కొత్తగూడెం, భద్రాచలంకు రెండు బస్సులను అదనంగా పంపిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు డోసులు టీకా తీసుకున్న వారిని మాత్రమే పోలింగ్ సిబ్బందిగా నియమించామని, అదేవిధంగా అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెండు డోసుల టీకా తీసుకొని ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. పోలింగ్ రోజు సీక్రసీ ఆఫ్ ఓటింగ్‌ను కచ్చితంగా పాటిస్తున్నామని, ఓటింగ్ కాంపార్ట్‌మెంట్‌లో కేవలం ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని, అందులో ఫొటో, వీడియోగ్రఫీలు నిషేధమని అన్నారు. 768 మంది ఓటర్లలో కేవలం ఆరుగురు మాత్రమే నిరక్షరాస్యులని, వారి అభ్యర్థన మేరకు వారు ఓటుహకు వినియోగించుకొనేందుకు మరొకరి సహాయానికి అనుమతించామని అన్నారు. ఎన్నికల సంఘం అందించిన వయొలెట్ కలర్ పెన్నును మాత్రమే ఓటింగ్‌లో ఉపయోగించాలన్నారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు ప్రాధాన్యాలను సూచించాల్సి ఉంటుందని అన్నారు.
1,015 మంది సిబ్బందితో బందోబస్తు: సీపీ
ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ పోలింగ్ బందోబస్తు కోసం మొత్తం 1,015 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. రూట్ మోబైల్లో ఒక ఎస్‌హెచ్‌వోతోపాటు ఇద్దరు ఆర్డ్ గార్డులను కేటాయించామన్నారు. పోలింగ్ కేంద్రం లొకేషన్లో ప్రత్యేక క్లాక్‌రూం ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు సెల్ఫోన్లు, పెన్నులు, ఇతర వస్తువులు అందులో అప్పగించి వెళ్లాలని, తిరిగి వచ్చేటప్పుడు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
మామిళ్లగూడెం, డిసెంబర్ 9: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోని ఏర్పాట్లను ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ కలిసి గురువారం పరిశీలించారు. పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను సూక్ష్మ పరిశీలన చేయాలని, ఓటర్లను గుర్తించేందుకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీవోలు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని చోట్లా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియపై మరోసారి అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం నాలుగు కేంద్రాలకు కేటాయించిన బస్సులను పరిశీలించారు. సామగ్రితో వెళ్తున్న సిబ్బందిలో అందులో పంపించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, నోడల్ అధికారులు శ్రీరామ్, శైలేంద్ర, మదన్‌గోపాల్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు పాల్గొన్నారు.