
రైతుబంధు పథకం అన్నదాతలకు పెట్టుబడి కష్టాలను తీర్చింది. రైతు ఆత్మహత్యలకు చరమగీతం పాడింది. కర్షకుల మోముల్లో చిరునవ్వులు చిందించింది. సంక్రాంతికి ముందే పల్లెల్లో పండుగ సందడిని తీసుకొచ్చింది. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రైతులు వినూత్న రీతిలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కర్షకుల లోగిళ్లు రంగవల్లులతో సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టుబడి సాయం పథకంపై ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పలు గ్రామాల్లో పంట క్షేత్రాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పంటాభిషేకాలు చేశారు. ఖమ్మం, సత్తుపల్లి, చింతకాని మండలాల్లో వివిధ పంట ఉత్పత్తులతో రైతుబంధు, కేసీఆర్, కేటీఆర్ పేర్లను అక్షరమాలగా రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఖమ్మం, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెల్లో సంక్రాంతికి ముందే పండుగొచ్చింది. ఊరూరా రైతు బంధు సంబురాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన రైతులు రైతు బంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలు పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు రైతు బంధు అంశంపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాల మేరకు వినూత్నరీతిలో సంబురాలు జరుపుకున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన వివిధ పంట ఉత్పత్తులతో రైతు బంధు అక్షరమాలను రూపొందించారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. పామాయిల్ గింజలతో రైతు బంధు అక్షరమాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత దేశానికి వెన్నెముక అని, కర్షకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ జూలూరుపాడులో జరిగిన రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. రైతును రాజుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నేలకొండపల్లి పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు తిలకించారు. పినపాక, కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల, బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల్లో రైతులు వివిధ రూపాల్లో సంబురాలు జరుపుకున్నారు. కారేపల్లి మండలం విశ్వనాథపల్లి, సీతారాంపురం గ్రామాల్లో రైతు బంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. కల్లూరు, తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి ఉన్నత పాఠశాల, కామేపల్లి మండలం కొమ్మినేపల్లి, భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వైరా మండలం గొల్లపూడిలో వ్యవసాయశాఖ ముగ్గులు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించింది. పెనుబల్లి మండలంలో వివిధ పోటీల విజేతలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బహుమతులు అందజేశారు. చింతకాని మండలం రామకృష్ణాపురంలో జరిగిన వారోత్సవాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పాల్గొన్నారు. కోయగూడెం పంచాయతీలో సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి ఆధ్వర్యంలో రైతుల ఇళ్ల ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దారు. చండ్రుగొండలో జరిగిన సంబురాల్లో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. మధిర మండలం సిరిపురంలో రైతువేదిక వద్ద సంబురాలు నిర్వహించారు. కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పంట చేలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టేకులపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చర్ల, ఇల్లెందు, కూసుమంచి మండలాల్లో రైతు బంధు సంబురాలు అంబరాన్నంటాయి.