
గజ్వేల్ మార్కెట్లో పత్తి ధర రికార్డు స్థాయిలో పలికింది. ఈ సంవత్సరం అధికవర్షాలతో పత్తిపంటలు పాడైపోవడం, ఉత్తరాది రాష్ర్టాల్లో పత్తికి డిమాండ్ పెరగడంతో పత్తికి సీజన్ ప్రారంభం నుంచే కనకపు వర్షం కురిపిస్తున్నది. రోజురోజుకూ ధర పెరుగుతూ వస్తోంది. మంగళవారం క్వింటాలు పత్తి రూ.8819, బుధవారం రూ.8853 పలుకగా, గురువారం అత్యధికంగా క్వింటాలుకు రూ.8907ధర వచ్చింది. సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరం 80వేల మందికి పైగా రైతులు లక్షా 27వేల ఎకరాల్లో పత్తిపంటను సాగు చేశారు. కాగా, ఇప్పటి వరకు సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, బెజ్జంకి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీల పరిధిలో 47వేల926మంది రైతుల ద్వారా 3,84,76 7 క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేశారు.
గజ్వేల్, డిసెంబర్ 30 : పత్తి రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. రికార్డు స్థాయిలో ధర పలుకుతుండడంతో పంటను ఉత్సాహంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరం 80వేల మందికి పైగా రైతులు లక్షా 27వేల ఎకరాల్లో పత్తిపంటను సాగు చేశారు. కాగా, ఇప్పటి వరకు సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, బెజ్జంకి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీల పరిధిలో 47 వేల926మంది రైతుల ద్వారా 3,84,767 క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు, అలాగే, జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేశారు. గతేడాది రెండు లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో దాదాపు రెండు లక్షల మంది పత్తిని సాగు చేశారు. కానీ, ప్రభుత్వం ప్రకటించిన రూ.5,550 మద్దతు ధర ప్రకారమే సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేశారు. ఈ సారి పంట విస్తీర్ణం తక్కువగా ఉండడంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.6వేల కంటే బహిరంగ మార్కెట్లోనే అధికంగా ధర వస్తుండడంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో, వ్యాపారులు, మిల్లర్లు రైతుల నుంచి పోటీ పడిమరీ పత్తిని కొనుగోలు చేస్తున్నారు. వానకాలంలో ముం దుగా వర్షాలు పడకపోవడం, ఆలస్యంగా అధిక వర్షాలు కురువడంతో చాలా వరకు పంట చేతికి రాలేదు. దీంతో నష్టపోతున్నామని రైతులు ఆందోళనకు గురయ్యారు. తెలంగాణ అలాగే ఉత్తర భారతదేశంలోనూ వర్షాల కారణంగా పత్తి పంట పాడైపోవడంతో పత్తికి మార్కెట్లో డిమాండ్ అధికమై, ధర కూడా ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నాటి నుంచి వ్యాపారులు పత్తి క్వింటాలుకు రూ.9వేల వరకు చెల్లించారు. అయితే నవంబర్, డిసెంబర్ మధ్య కొద్దిగా ధర తగ్గినా మళ్లీ క్రమంగా ధర పెరుగుతూ వచ్చింది. దీంతో, రైతుల్లో ధైర్యం వచ్చింది. ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి రావాల్సి ఉండగా, అధికవర్షాలతో ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు మాత్రమే రైతులు సేకరించగలిగారు. కానీ, గతేడాది ధరతో పోలిస్తే ఈ సారి సాధారణం కంటే ఎక్కువగానే రైతులు లాభపడ్డారు.
ధర మరింత పెరిగే అవకాశం
ప్రస్తుతం, మార్కెట్లో పత్తి చాలా తక్కువగా వస్తుండగా డిమాండ్ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో మరింత ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 70శాతానికి పైగా జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తిని సేకరించగా, మరో 30 శాతం ఇంకా పత్తి సేకరించాల్సి ఉందని అధికారులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న ధర జనవరి చివరి వారం వరకు రాకపోవచ్చని వ్యాపారులు చెబుతుండగా, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి ఇంకా ధర పెరుగొచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు.
గతేడాదితో పోలిస్తే 38శాతమే కొనుగోళ్లు
గతేడాది సీసీఐ ద్వారా 7,89,602 క్వింటాళ్లు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా 3,65,984 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరుగగా, ఈ ఏడాది 3,84,767 క్వింటాళ్లను మిల్లులు, వ్యాపారులు కొనుగోలు చేశారు. గతేడాది కన్నా ఈసారి విస్తీర్ణం సగానికి తగ్గగా, అందులోనూ అధికవర్షాలతో పంట నష్టం జరిగింది. దీంతో గతేడాది కొనుగోళ్లతో పోల్చుకుంటే ఇప్పటివరకు కేవలం 38 శాతం మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. పంట పండించిన రైతులకు మంచి లాభాలు రాగా, కొద్దిమంది రైతులకు పెట్టుబడులు దక్కాయి.
గజ్వేల్ మార్కెట్లో క్వింటాలు రూ. 8907
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో గురువారం అత్యధికంగా క్వింటాలుకు రూ.8907 ధర పలికింది. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్‌కు 16 మంది రైతులు 64 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చారు. కాగా, తున్కిబొల్లారం గ్రామానికి చెందిన రైతు మూడు క్వింటాళ్ల పత్తిని తీసుకురాగా, అతడికి ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా క్వింటాలుకు రూ.8907 వ్యాపారులు చెల్లించారు. అత్యల్పంగా క్వింటాలుకు రూ.8250 పలికింది. గజ్వేల్ మార్కెట్ కమిటీలో 1502 మంది రైతుల నుంచి ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా వ్యాపారులు 4324 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఈ మేరకు రైతుల ఖాతాల్లో రూ.3,46,12,173 జమచేశారు. బుధవారం రాత్రి వరకు గజ్వేల్ ప్రాంతంలోని మిల్లుల ద్వారా 17,531మంది రైతుల నుంచి 89,870 క్విం టాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ వెల్లడించారు.
ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఉమ్మడి జిల్లా నుంచి రైతులు వచ్చి పత్తిని విక్రయిస్తు న్నారు. గజ్వేల్‌లోనే వ్యాపారులు అధిక ధర చెల్లిస్తుండడంతో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతంలో గతం కన్నా తక్కువ స్థాయిలో దిగుబడి వచ్చినప్పటికీ రైతుకు మంచి ధర వస్తుంది. నల్గొండ, వరంగల్ లాంటి పరిసర జిల్లాల నుంచి పత్తి మిల్లుల వ్యాపారులు వచ్చి అధికధర చెల్లించి పత్తిని కొనుగోలు చేస్తున్నారు.
-జాన్‌వెస్లీ, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి
మంచి లాభాలు వచ్చినయ్ ..
అక్టోబర్ చివరి వారంలో గజ్వేల్ మార్కెట్లో పత్తిని విక్రయించిన. అప్పుడు క్వింటాలుకు రూ.6600 ధర పలికింది. ఈరోజు మళ్లీ మూడు క్వింటాళ్ల పత్తి తీసుకొస్తే రూ.8700 వచ్చింది. నాణ్యమైన పత్తికి రూ.8907 దాకా పైసలు ఇస్తున్నరు. ఈసారి పత్తి పండించినోళ్లకు మంచి లాభాలు వచ్చినయ్. గజ్వేల్‌లో పత్తి ధర అధికంగా వస్తుందని మాతో పాటు ఇంకా దూరం నుంచి కూడా రైతులు పత్తిని గజ్వేల్‌కు తీసుకువస్తున్నరు.
-తిరుపతి, వెంకటాయపల్లి, రైతు, తూప్రాన్
గుజరాత్లో బాగా డిమాండ్ ఉంది
గుజరాత్లో పత్తికి చాలా డిమాండ్ ఉంది. అధిక వర్షాలతో అక్కడ పత్తి పంటలు పూర్తిగా చెడిపోయాయి. దీంతో, ఆ ప్రాంతంలో పత్తి దొరకడం లేదు. గజ్వేల్‌తో పాటు పరిసర ప్రాం తాల వారు పండించే పత్తికి అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రైతులకు మంచి ధర ఇవ్వడంతో పాటు మాకూ లాభం వచ్చేలాగ కొనుగోళ్లు చేస్తున్నాం.
-నేతి చిన్న శ్రీనివాస్, వ్యాపారి