
రామన్నపేట, జనవరి 7 : కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే కరోనా ఐసొలేషన్ వార్డులను సిద్ధ్దంగా ఉంచామని జిల్లా దవాఖానల సేవల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) చిన్నానాయక్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. వార్డుల్లో కలియ తిరిగి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, సమయపాలన పాటించాలని కోరారు. సాధారణ కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలని సూచి ంచారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే కరోనా ఐసొలేషన్ వార్డులను సిద్ధ్దంగా ఉంచామని తెలిపారు. రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. దాంతో పాటు ప్రతి దవాఖానలో పది రోజుల్లో 20 పడకల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఆయన వెంట దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, వైద్యులు బి.వీరన్న, పురుషోత్తంరాజు, నిఖిల, వైద్యసిబ్బంది రాణి, సువర్ణ, పద్మమ్మ, సతీశ్, వెంకటేశ్, కవిత, సునీత, స్వప్న, రేష్మ పాల్గొన్నారు.