
నల్లగొండ, జనవరి 6 : పుర పాలక సంఘాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం 30శాతం గౌరవ వేతనం పెంచుతూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పని చేస్తున్న సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ గౌరవ వేతనం అమలు కానుంది. గతేడాది జూన్ నుంచి ఈ పెంచిన వేతనం అందదించాలని సీడీఎంఏ సత్యనారాయణ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి నెలకు రూ.12వేల వేతనం అందుతుండగా పెరిగిన 30శాతంతో గతేడాది జూన్ నుంచి మరో రూ.3600 కలిపి మొత్తంగా రూ.15600 చొప్పున చెల్లించనున్నారు.
3055మందికి ప్రయోజనం
వేతన పెంపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3055మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది మున్సిపాలిటీల వారిగా పరిశీలిస్తే నల్లగొండలో 705 మంది ఉండగా, తిరుమలగిరిలో 65, సూర్యాపేటలో 660, మిర్యాలగూడలో 316, నేరేడు చర్లలో 35, చౌటుప్పల్‌లో 124, దేవరకొండలో 92, భువనగిరిలో 300, భూదాన్‌పోచంపల్లిలో 57, నందికొండలో 45, హాలియాలో 80, కోదాడలో 168, మొత్కూర్లో 67, హుజూర్ నగర్లో 42, నకిరేకల్‌లో 113, చిట్యాలలో 55, ఆలేరులో 69, యాదగిరి గుట్టలో 62 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 3055 మందికి ఈ గౌరవ వేతనం అమలు కానుంది. వీటిలో శానిటరీ సిబ్బందితో పాటు కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. వీరికి జనవరి నెల గౌరవ వేతనం ఫిబ్రవరిలో పెరిగిన వేతనంతో కలిపి ఇవ్వనున్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనం 30శాతం పెంచుతూ జీఓను జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. గత ప్రభుత్వాలు ఔట్ సోర్సింగ్ కార్మికులను కనీసం గుర్తించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు మంచి రోజులు వచ్చాయి.
రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందనడంలో సందేహం లేదు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 30శాతం వేతనాలు పెంచడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపిన ప్రభుత్వానికి అండగా ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం.