వందేండ్ల చరిత్ర గల ఆలయాలు ఆ ఊరి సొంతం. ఒకటికాదు రెండు కాదు ఏకంగా నూటొక్క నందులకు నిలయంగా మారి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్నది యాచారం మండలంలోని నందివనపర్తి. గ్రామం నలుమూలల దేవాలయాలే దర్శనమిస్తాయి. ఒక్కప్పుడూ ఊరంతా నందులే ఉండేవి.. అందులో కొన్నికాలక్రమేణ కనుమరుగయ్యాయి. అలాగే జ్ఞాన సరస్వతి ఆలయం కూడా ఉన్నది. ఇక్కడున్న పురాతన ఓంకారేశ్వరాలయానికి
1471 ఎకరాల భూములున్నాయి.
యాచారం, డిసెంబర్ 11 : మండలంలోని నందివనపర్తి గ్రామం ప్రధాన పుణ్యక్షేత్రాలకు నిలయంగా విరాజిల్లుతున్నది. ఆలయాలకు పుట్టినిల్లుగా జిల్లాలోనే గ్రామం ప్రఖ్యాతి గాంచింది. వందల ఏండ్ల చరిత్ర ఉన్న ఆలయాలతో ఈ గ్రామంలో భక్తి భావం పెంపొందుతున్నది. అక్కన్న మాదన్న, కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు గ్రామంలో నేటికి దర్శనమిస్తున్నాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా నూటొక్క నందులకు నిలయంగా మారింది. అందుకే నందివనపర్తిగా గ్రామానికి పేరొచ్చినట్లు పూర్వీకులు చెబుతున్నారు. గ్రామంలో ఒకప్పుడు ఎటు చూసినా నంది విగ్రహాలే దర్శనమిచ్చేవట. అందులో కొన్నింటిని దుండగులు ఎత్తుకెళ్లగా, మరికొన్నింటిని గుప్తనిధుల కోసం ధ్వంసం చేశారు. ఇంకొన్ని క్రమంగా కాలగర్భంలో కలిసిపోయాయి. సిద్ధేశ్వరాలయం, ఓంకారేశ్వరాలయం, నందీశ్వర మహాక్షేత్రం, చెన్నకేశవ ఆలయం, రాములోరిగుడి, అభయాంజనేయస్వామి ఆలయం, జ్ఞానసరస్వతీ మందిరంతో సకల గ్రామ దేవతలు కొలువుదీరిన ఆలయాలు గ్రామ నలుమూలల ఉన్నాయి.
పురాతన ఓంకారేశ్వరాలయం..
నందివనపర్తి గ్రామం నడిబొడ్డున అతి పురాతన ఓంకారేశ్వరాలయం ఉన్నది. వందల ఏండ్ల చరిత్ర గల ఆలయంలో శివ పార్వతులతో పాటు సీతారామాంజనేయ స్వాములు కొలువుదీరారు. ఆలయానికి 1471 ఎకరాల భూములు ఉన్నాయి. శివపార్వతుల పంచలోహ విగ్రహాలూ ఉన్నాయి. కోట్ల ఆస్తులున్న ఆలయానికి ఆదాయం పెద్దగా లేకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆలయ ధర్మకర్త పప్పు కృష్ణమూర్తి నిత్యం పూజలు చేస్తున్నారు. ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయం ఎదుట ఉన్న పురాతన కోనేరు ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ప్రతి ఏటా శ్రీరామ నవమి, శివరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయి.
ఎనిమిది అడుగుల ఏకశిలా నంది..
పూర్వం ఓ గోవు పొలంలో చేను మేస్తుండగా ఆగ్రహానికి గురైన రైతు కర్రతో బలంగా చితకబాదాడు. కాలుకు తీవ్రగాయమైన ఆ గోవు గెంటుతూ వచ్చి నందివనపర్తిలో నిలిచి శిలగా మారిందని పూర్వికుల కథనం. క్రీ.శ 11వ శతాబ్దంలో అక్కన్నమాదన్నల కాలంలో చిన్నపాటి దేవాలయాన్ని నిర్మించారు. అది క్రమంగా శిథిలావస్థకు చేరింది. విధి నిర్వహణలో అప్పటి ఇబ్రహీంపట్నం తహసీల్దార్ పల్లా నాగేందర్ అటునుంచి వెళుతూ ఆలయం వద్ద సేదతీరారు. ఆలయంలో ఉన్న అతిపెద్ద సుందరమైన, కళాత్మకమైన నంది విగ్రహాన్ని చూసి తరించిపోయాడు. ఆ శిల్పసంపదకు మంత్రముగ్ధుడయ్యాడు. ఇంత ప్రఖ్యాతి గాంచిన నంది విగ్రహం, శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని చూసి పునర్నిర్మించాలని సంకల్పించాడు. డిసెంబర్ 11, 1967న ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించాడు. రెండున్నర మాసాలు శ్రమించి, ఆలయాన్ని ఎంతో అందంగా, ఎత్తైన ప్రదేశంలో పూర్తిగా రాతితో నిర్మించారు. ఫిబ్రవరి 26, 1968లో శివరాత్రిని పురస్కరించుకుని మొదటిసారి ఉత్సవాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మహాశివర్రాతికి ఆలయంలో అతడి వారసులు ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు.
సిద్ధేశ్వరాలయంలో స్వయంభూ శివలింగం
నందివనపర్తిలో అతిపురాతన సిద్ధేశ్వరాలయం ఉన్నది. 150 ఏండ్ల చరిత్ర గల ఈ ఆలయంలో స్వయంభు శివలింగం ఉన్నది. ప్రతి ఏటా కొంచెం పెరుగుతున్నట్లు ప్రతీతి. శివలింగంపై సూర్యకిరణాలు పడడంతో ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైందని భక్తులు భావిస్తారు. కాకతీయుల కాలంలో ఆలయం రూపుదిద్దుకున్నట్టు కథనం. ఆలయం గర్భగుడి పూర్తిగా రాతి నిర్మాణం కావడం, ముందు నుంచి రాతి స్తంభాలతో వెయ్యి స్తంభాల గుడిలా ఉన్నది. గర్భగుడి పై భాగంలో శ్రీశైలం ఆలయ మాదిరిగా శ్రీచక్రం ఉన్నది. గర్భగుడిలో స్వయంభు శివలింగం, ఆలయం ఎదుట నంది విగ్రహం, అతి పురాతన రాతి కట్టడం గల సుందరమైన కోనేరు ఉన్నది. ఆలయ ఆవరణలో పురాతన నాగులమ్మ, నాగు పాముల ప్రతిమలు రాళ్లపై చెక్కబడి ఉన్నాయి. ఆలయం ముందున్న పొలంలో నంది విగ్రహాన్ని గుప్తనిధుల కోసం ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలో పురాతన చేదుడు బావి ఉన్నది. గ్రామానికి సమీపంలో రాతి బండపై పురాతన కాలంలో చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించారు.
అభయాంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం..
ఆంజనేయస్వామి దేవాలయాన్ని పునర్నిర్మించాలని గ్రామానికి చెందిన కొంతమంది పూర్వ విద్యార్థులు చందాలు వసూళ్లు చేసి, ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఆలయాన్ని 2006లో పునర్నిర్మించారు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతోపాటు ఆలయ ప్రహరీని నిర్మించారు.
చందాలతో చదువుల తల్లి ఆలయం..
గ్రామీణ ప్రాంతాల్లో సరస్వతీదేవి ఆలయాలు చాలా అరుదు. అలాంటిది నందివనపర్తి గ్రామంలో జ్ఞానసరస్వతి సేవా సమితి ఆధ్వర్యంలో జ్ఞానసరస్వతీదేవి మందిరాన్ని 2009లో రూపొందించారు. సమితి వ్యవస్థాపకులు సదా వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో కేవలం విద్యార్థుల విరాళాలతోనే అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో సరస్వతీదేవి మూల విరాట్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయంలో హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. అమ్మవారికి బంగారం, వెండి ఆభరణాలను అలంకరించారు. వసంత పంచమికి సామూహిక అక్షరాభ్యాసం, కార్తికమాస పూజలు చేస్తారు. ఇలా ప్రధాన ఆలయాలతో పాటు గ్రామ దేవతలతో పాటు మల్లన్న, బీరప్ప ఆలయాలు ఉన్నాయి. ప్రతీ ఏటా బోనాలు, జాతర వైభవంగా జరుగుతాయి.