
రామన్నపేట, డిసెంబర్ 2 : ఆన్లైన్ యాప్ ద్వారా సునాయసంగా డబ్బులు సంపాదించవచ్చని యువతను నమ్మించి కోట్లల్లో దండుకున్నారు. చివరికి యాప్ మూతపడడంతో మోసపోయినట్లు గుర్తించిన యువత లబోదిబోమంటున్నారు. ఈ ఉదంతం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో వెలుగు చూసింది. ఈ యాప్ ద్వారా రామన్నపేట మండలంలో వెయ్యి నుంచి 1500 మంది వరకు మోసపోయినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. గత డిసెంబర్ 14న హగ్‌స్లీప్ అనే యాప్ ఆన్లైన్ మార్కెట్లోకి వచ్చింది. లింక్ ద్వారా ఒక ఫోన్ నుంచి మరొకరికి పంపే విధంగా యాప్‌ను రూపొందించారు. లింక్ ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగానే వివిధ ఆఫర్లతో కూడిన కూపన్లు డిస్ప్లేపై కనబడుతాయి. వాటిని స్కాన్ చేయగానే డిస్కౌంట్ చూపిస్తుంది. దానిని ఓకే చేయగానే డిస్కౌంట్ పోను మిగిలిన మొత్తం సదరు వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో నుంచి డెబిట్ అవుతాయి. యాప్ లింక్‌ను డౌన్లోడ్ చేసుకోగానే లింక్ పంపించిన వ్యక్తికి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు తన ఖాతాలో జమ అవుతాయి. మూడు వేలు, ఆరు వేలు, తొమ్మిది వేలు, 15వేలు, 25వేలు కూపన్లు ఉంటాయి. ఎంచుకున్న రూపాయలను బట్టి రోజుకు ఆరు వందల నుంచి రూ.5వేల వరకు జమ అవుతాయని ఆశ చూపారు. ఆర్థిక స్థోమతను బట్టి యువకులు యాప్‌ను ఎంచుకొని అమౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేశారు. డిసెంబర్ 28 వరకు చెప్పినట్లుగానే ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. దీంతో సునాయసంగా డబ్బు లు వస్తుండటంతో వారు తమ స్నేహితులు, బంధువులకు లింక్‌ను పంపి చేరే విధంగా ప్రోత్సహించారు. దీంతో చాలా మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే.. డిసెంబర్ 28 తరువాత యాప్ సేవలు నిలిచిపోయాయి. అప్పటి వరకు వచ్చిన డబ్బులు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అకౌంట్ ప్రాసెంసింగ్ అంటూ వచ్చింది. డిసెంబర్ 31 తరువాత యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో యువకులు మోసపోయామని గ్రహించారు. యాప్ మోసానికి మండలంలో జనం కోల్పోయిన సొమ్ము కోట్లల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. ఇప్పటి వరకు బాధితులు ఎవరూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు.