
నేటి యువత ఫొటోగ్రఫీపై రోజురోజుకు మోజు పెంచుకుంటున్నది. సెలవులొస్తే చాలు ఖరీదైన కెమెరాలను భుజాన వేసుకుని జట్లుజట్లుగా బండ్లపై ఫొటోషూట్‌కు వెళ్తున్నారు. రోడ్లు, పార్కులు, అటవీ ప్రాంతం, వెంచర్లు, అందమైన భవనాలు, నీళ్లు ఇలా ఇక్కడ అక్కడ అని లేకుండా ఎక్కడ ఫొటో దిగాలనిపిస్తే అక్కడ ఫొటో దిగడానికి రెడీ అయిపోతున్నారు. మూడు, నాలుగేండ్ల క్రితం ఇంజినీరింగ్ లాంటి వృతివిద్యా కోర్సులు చేసే విద్యార్థులతో మొదలైన ట్రెండ్ నేడు విస్తృతమై పాఠశాల స్థాయికి చేరింది.
మునిపల్లి, డిసెంబర్ 18 : శివారు ప్రాం తాలు, చారిత్రక, పర్యాటక, సందర్శనీయ ప్రాం తాలు, అడవులు, జలపాతాలు, ప్రాజెక్టులు, చెరువులు ఫొటోషూట్లకు కేంద్రాలకు మారుతున్నాయి. సెలువు రోజులు, వీకెండ్ రోజుల్లో ఇక్కడ ఫొటోషూట్లకు యువత ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లికి సమీపంలో బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని సింగూర్ ప్రాజెక్టు ఉండడంతో ప్రతి అదివారం ప్రాజెక్ట్టును వీక్షించడానికి వచ్చిన యువత జోరుగా ఫొటోలు దిగుతున్నారు.అలాగే, ఈ ప్రాంతమే కాకుండా చూడదగ్గ ప్రదేశాలు ఎక్కడ ఉన్నా, దూరాన్ని కూడా లెక్క చేయకుండా పరుగెత్తుతున్నారు. ఫొటోలు దిగడం.. ఆ వెంటనే ఫేస్బుక్, వాట్సా ప్ స్టేటస్, ప్రొఫైల్ పిక్ ఇలా నచ్చిన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఎంతమంది లైక్ కొడుతున్నారు, ఎవరు కామెంట్ చేస్తున్నారు అని మాటిమాటికి చూస్తున్నారు.
అద్దెకు కెమెరాలు…
ఆర్థికంగా ఉన్న వారు కెమెరాలను కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఉండి ఫొటోలు దిగాలి అనుకునేవారు మాత్రం ఒక టీమ్‌గా ఏర్పడి కెమెరాలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. 12 గంటల వ్యవధికి రూ.400 నుంచి రూ.500 వరకు అద్దె చెల్లిస్తూ శుభకార్యాలు, పర్యాటక ప్రదేశాలు, విహారయాత్రలకు తీసుకెళ్తున్నారు.
ఎడిటింగ్..అప్లోడ్…
కష్టపడి తీసిన ఫొటోలను ఎడిటింగ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారు. కొందరు సొంతంగా ఎడిటింగ్ చేసుకుంటుండగా, మరికొంత మంది డబ్బులు చెల్లించి తమ కు నచ్చిన విధంగా ఫొటోలను తీర్చిదిద్దుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో అప్లోడ్ చేసి ఎన్ని లైక్‌లు పడితే అంత గొప్పగా భావిస్తున్నారు. ఒక్కో జట్టు కనీసం నెలలో నాలుగు నుంచి ఐదు షూట్లు చేస్తున్నట్లు సమాచారం.
కెమెరాను అద్దెకు తీసుకుంటాం
కెమెరాలను అద్దెకు తీసుకొని ఫొటో షూట్లు చేస్తాం. వాటికి రూ.400నుంచి రూ.500వరకు అద్దె చెల్లిస్తాం. నాకు ఫొటో దిగడంతో పాటు తీయడమంటే చాలా ఇష్టం.దిగిన ఫొటోలను ఎడిటింగ్ చేసి ఫేస్బుక్, వాట్సాప్‌లలో అప్లోడ్ చేస్తా. సెలవు దినాల్లో పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఫొటోలు దిగుతా.