
షావుకారు ఇచ్చే అప్పు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. పెట్టుబడి బెంగ లేదు.. అప్పుల బాధ లేదు.. విత్తనాలు, ఎరువుల కొరత లేదు.. పుష్కలంగా నీళ్లు, నాణ్యమైన విద్యుత్, పండించిన పంటకు మద్దతు ధర.. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే బీమాతో రైతు కుటుంబాలకు భరోసా.. వెరసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న పరిస్థితులన్నీ నేడు కనుమరుగైపోయాయి. దుక్కిదున్ని, విత్తు విత్తగానే నీళ్లో రామచంద్రా అంటూ రైతులు పడే బాధలన్నీ పటాపంచలయ్యాయి. కేసీఆర్ కలల రాజ్యంలో ఇప్పుడు రైతే రాజు. ఒకప్పుడు దండుగ అనుకున్న వ్యవసాయం రైతు బంధు పథకం మొదలైన తర్వాత పండుగలా సాగుతున్నది. 2018 నుంచి మొదలైన ఈ పథకంలో ప్రతియేటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా.. ఎనిమిది విడుతల్లో రూ.1,937.29కోట్ల సాయం రైతులకు అందింది. సాగుకు అనువైన పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఒకప్పుడు బీడుగా పడి ఉన్న భూములు సైతం నేడు సాగులోకి రావడంతో జిల్లాలోని రైతు కుటుంబాలు సంతోషంతో జీవిస్తున్నాయి. రైతు బంధు సాయం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10 వరకు రూ.50 వేల కోట్లకు చేరనున్న నేపథ్యంలో నేటి నుంచి 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రైతు బంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ప్రదర్శనతోపాటు సంక్రాంతి ముగ్గుల్లో సైతం రైతుబంధును ప్రతిబింబింపజేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పంట పెట్టుబడి సాయం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. సీజన్‌కు ముందే సిద్ధంగా ఉన్న ఎరువులు, విత్తనాల నేపథ్యంలో ఏటా పూర్తి భరోసా, నిండైన నమ్మకంతో ఏరువాకకు రైతులు సిద్ధమవుతున్నారు. పెరిగిన దిగుబడుల నేపథ్యంలో.. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరతో రైతులకు నష్టాలనేవే లేకుండా పోయాయి. సీజన్‌కు ముందే చేతిలో పుష్కలంగా ఉన్న డబ్బులతో అప్పుల వేట అవసరం లేకుండా పోయింది. షావుకారు చుట్టూ తిరిగే పరిస్థితులు కూడా లేవు. తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నా.. గుమ్మం తొక్కాల్సిన అవసరమే లేకుండా పోయింది.
వర్షం పడిన మరుక్షణమే.. రైతు ధ్యాస అంతా వ్యవసాయంపైనే.
ప్రతి సీజన్‌కూ ముందు పెట్టుబడుల బెంగ లేకుండా ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో రైతన్నలు బిజీబిజీగా ఉంటున్నారు. ఒకప్పుడు వ్యవసాయం అంటేనే వెనుకడుగు వేసే పరిస్థితులు ఉండగా.. నేడు రైతు కుటుంబాలు రెట్టించిన ఉత్సాహంతో సాగుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు జిల్లా రైతాంగానికి కొండంత భరోసా కల్పిస్తున్నాయి. గడిచిన రెండేండ్లలోనే లక్షకు పైగా ఎకరాలకు పెరిగిన పంటల సాగు విస్తీర్ణం.. మూడేండ్లలో 17 లక్షలకు పైగా రైతులకు అందిన రూ.1,645కోట్ల పెట్టుబడి సాయం.. ఇటు వ్యవసాయంలోనూ.. అటు రైతుల జీవితాల్లోనూ పెనుమార్పులకు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి.
జిల్లాలో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి మండుటెండల్లోనూ చెరువులు, కుంటలు జలకళతో కనువిందు చేస్తున్నాయి. మూసీ పరవళ్లు.. గతేడాది నుంచి అందుబాటులోకి వచ్చిన గోదావరి నీళ్లతో సాగుకు ఢోకా లేకుండా పోయింది. 24 గంటల విద్యుత్ ఫలితంగా పంటలు ఎండిపోతాయన్న బెంగ తీరడంతోపాటు రైతు ఆత్మహత్యలనేవే లేకుండా పోయాయి.
గిరిజన రైతుకు వెన్నుదన్నుగా..
పోడు భూముల్లో ఎన్నో ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు రైతు బంధు సాయాన్ని అందించేందుకు నిర్ణయించి సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రతి సీజన్లోనూ పెట్టుబడి సాయాన్ని అందిస్తుండగా… జిల్లాలో రెండు సీజన్ల నుంచీ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులకూ సాయాన్ని అందిస్తున్నారు. గత వానకాలం సీజన్లో 168 మంది రైతులకు సంబంధించిన 435 ఎకరాలకు పైగా పెట్టుబడి సాయం అందించగా.. ప్రస్తుత యాసంగి సీజన్లో సాయం పొందే గిరిజన రైతుల సంఖ్య మరింతగా పెరిగింది.
రైతు ఖాతాల్లో రూ.146.93కోట్లు జమ..
ప్రస్తుత సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. జిల్లాలో 2,43,400 మంది రైతులకు సంబంధించి 6,04,077 ఎకరాలకు రూ.302.03కోట్ల పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నది. గత డిసెంబరు 28 నుంచి ఖాతాల్లో సాయం డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుండగా డిసెంబర్ 31 నాటికి 1,8,445 మంది రైతుల ఖాతాల్లో రూ.146.93కోట్లు పడ్డాయి. మిగతా డబ్బులను సైతం నిర్దేశించిన ఎకరాల ప్రకారం
జమచేయనున్నది.
రైతుబంధు ఎంతో ఆదుకుంటున్నది..
గతంలో ఏ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించనేలేదు. కేసీఆర్ సారు మాత్రం రైతుల గురించి ఆలోచించి వ్యవసాయాన్ని బాగుజేస్తున్నడు. ముఖ్యమంత్రి ఇస్తున్న రైతుబంధు మమ్ముల్ని చాలా ఆదుకుంటున్నది. నాకు మూడెకరాల చిల్లర పొలం ఉంది. కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు డబ్బులు మొన్ననే నా అకౌంట్ల 17వేలు పడ్డయి. ఏటా డబ్బులు పడంగనే విత్తనాలు, ఎరువులు కొంటున్నా. అంతకు ముందు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టేది. ఇప్పుడు మాత్రం ఆ బాధలేదు. కరంటు, నీళ్లు పుష్కలంగా ఉంటున్నయి. వ్యవసాయం చేసుకునేందుకు రైతులకు కేసీఆర్ సర్కారు అన్ని రకాల సౌలతులు కల్పిస్తున్నది. పంట ఏసినప్పుడల్లా మాకు పెట్టుబడి ఖర్చులు ఇచ్చి ఏ రంది లేకుండా కేసీఆర్ సారు మాకు అండగా నిలబడుతున్నడు.
ప్రైవేటు అప్పులకు స్వస్తి…
తొలకరి పలుకరించగానే రైతులు బేలగా వడ్డీ వ్యాపారి వైపు చూడడం.. అడిగినంత మిత్తికి ఒప్పుకుని అప్పు చేయడం ఒకప్పటి మాట. రైతు బంధు సాయం వచ్చాక రైతులకు పెట్టుబడి ఇబ్బందులనేవే లేవు. సంక్షోభ సమయంలోనూ రైతుకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా నిరాటంకంగా సాయం అందిస్తున్నది. దాంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటూ పంటలను పండించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో బ్యాంకులు సైతం ఇతోధికంగా రుణాలను అందిస్తున్నాయి. గతేడాది వానకాలంలో జిల్లాలో 797.44 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకుని 808.20కోట్ల రుణాలను అంటే 101 శాతం మేర రైతులకు అందించాయి. ఈ ఏడాది 2,349.73కోట్ల మేర పంట రుణాలను అందించేలా జిల్లాలోని బ్యాంకులు లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా పంట రుణాలను అందిస్తున్నాయి. పంటల సాగు విస్తీర్ణం పెరుగడం, దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉండడంతో రైతులు బ్యాంకు రుణాలు పొందడమే కాకుండా.. సకాలంలో చెల్లింపులు జరిపి ఏటా మనోధైర్యంతో సాగుకు ఉపక్రమిస్తుండం శుభ పరిణామమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం…
రైతులు ఇష్టంతో పంటలను సాగు చేస్తున్నారడానికి గడిచిన నాలుగేండ్లలో జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణమే నిదర్శనం. 2017-18 వానకాలంలో జిల్లాలో 3.44లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. 2020-21 వానకాలం నాటికి సాగు విస్తీర్ణం 4.38లక్షల ఎకరాలకు పెరిగింది. అలాగే 2017-18 యాసంగిలో కేవలం 1.20లక్షల్లోనే ఉన్న పంటల సాగు ఏకంగా 2020-21 యాసంగి నాటికి 2.40లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ ఏడాది వానకాలంలో 3.64 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. యాసంగిలోనూ అంతే మొత్తంలో సాగు కావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీరు.. ఉచిత విద్యుత్ వంటి పరిస్థితుల నేపథ్యంలో వలసవెళ్లిన ఎన్నో కుటుంబాలు సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాయి. సకాలంలో పెట్టుబడి సాయం అందించడంతోపాటు విత్తనాలు, ఎరువులను సమృద్ధిగా అందుబాటులోకి ఉంచడం వంటి చర్యల ఫలితంగా ఒకప్పుడు ఎకరమే సేద్యం చేసిన రైతులు నేడు పది ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.