
ఆలేరు టౌన్, డిసెంబర్ 15 : ఆరోగ్య సమాజ నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ రూపొందించడం ద్వారా వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా వైద్యారోగ్య శాఖ యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన సర్వేలో 702 మంది ఆశ కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను ఆశ డిసీజ్ ప్రొఫైల్ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. సర్వే ఇప్పటి వరకు 68శాతం పూర్తయ్యింది. ఓ వైపు కొవిడ్ వ్యాక్సినేషన్లో పాల్గొంటూనే మరోవైపు కుటుంబంలోని అందరి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. గతంలో బీపీ, క్యాన్సర్, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించగా ఈ సారి 12 రకాల వ్యాధులను చేర్చారు. టీబీ, కుష్ఠు, మానసిక, గుండె సంబంధిత వ్యాధులు, నోటి, రొమ్ము, గర్భాశయ ముఖ క్యాన్సర్, నడువలేని పరిస్థితిలో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు. డిజిటల్ విధానంలో ప్రత్యేక ఎన్సీడీ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఆశ కార్యకర్త తన పరిధిలో ఉన్న జనాభాలో రోజూ 10 మందికి తగ్గకుండా సర్వే చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి ఇంట్లో అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకుని ముసలి వాళ్ల వరకు వారి వివరాలు, వారికున్న సాధారణ జబ్బులతో పాటు దీర్ఘకాలిక జబ్బుల వివరాలు, లక్షణాలు, ఇప్పటి వరకు తీసుకున్న వైద్య చికిత్స ఉంటే ఆ వివరాలను యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. అంతే కాకుండా ట్యాబ్‌లో ఆధార్, సెల్‌ఫోన్ నంబర్ నమోదు చేసి, మొత్తం వివిధ అంశాల ప్రశ్నావళితో సర్వే చేస్తున్నారు. ప్రతి ప్రశ్నకు అవును, కాదు వంటి ఆప్షన్లు ఉంటాయి. డిసెంబర్ చివరి నాటికి సర్వే పూర్తి చేయాలని నిర్దేశించారు. ఆశ కార్యకర్తలు సేకరించిన వివరాలను ఏఎన్ఎంలు పరిశీలించి సక్రమమేనని ధ్రువీకరించిన తరువాత ప్రాథమిక ఆరోగ్య అధికారి తనిఖీ చేస్తారు. సర్వే వివరాలు ఎప్పటికప్పుడు సబ్ సెంటర్ నుంచి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యాలయం వరకు తెలుస్తాయి. యాప్‌లో కుటుంబ యజమాని పేరు నమోదు చేసి, సభ్యుల వివరాలు ఆధారాలతో సహా పొందుపరుస్తారు. అంతే గాకుండా పొగ, మద్యపానం అలవాట్లు ఉన్న వివరాలను నమోదు చేస్తున్నారు. కుటుంబ యజమాని ఆదాయం, ఇంటి స్థితిగతులు, నల్లా, రేషన్‌కార్డు, పాన్‌కార్డు, పింఛన్, ప్రభుత్వ పథకాల ద్వారా ఏమైనా లబ్ధి కలిగిందా..? ఉద్యోగ, చదువు తదితర వివరాలు పొందుపరుస్తారు. జనన, మరణ వివరాలు సైతం నమోదు చేస్తారు.
అందరికీ హెల్త్ ఫ్రొఫైల్…
రోడ్డు ప్రమాదం, విపత్తులో గాయపడి ఎంతో మంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో సకాలంలో చికిత్స అందక మృత్యువాత పడుతున్నారు. వైద్యులకు వారి ఆరోగ్య చరిత్ర తెలియకపోవడమే అందుకు మొదటి కారణం. ప్రమాదాలకు గురై వచ్చిన వారికి బ్లడ్‌గ్రూప్, బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేసి వాటి ఫలితాలు వచ్చే లోపు కాలాయాపన జరుగుతుంది. ఈ వివరాలు ముందుగా తెలిస్తే చికిత్స అందించడం సులభతరమౌతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ పౌరుల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సంకల్పించారు. ‘ఈ – హెల్త్’ పేరుతో ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించి అన్ని రకాల హెల్త్ అప్లికేషన్లను తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. దాంతో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు ఆన్లైన్ నమోదవుతాయి. హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసిన తర్వాత ప్రత్యేక నంబర్‌తో కూడిన హెల్త్‌కార్డులను జారీ చేయనున్నారు. ఈ విధానంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నంబర్ ఆధారంగా రోగి ఆరోగ్య వివరాలు తెలిసిపోతాయి. ఏ ప్రభుత్వ దవాఖానకు వెళ్లినా.. ఆ నంబర్ చెబితే వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షమౌతాయి. రోగికి గతంలో వచ్చిన వ్యాధులు, చేసిన పరీక్షలు, వాటి రిపోర్టులు, వాడిన మందులు తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. దాంతో చికిత్స అందించడం సులభమౌతుంది.
వైద్యం సులభంగా అందించవచ్చు…
అసంక్రమిత వ్యాధులపై ఆశ కార్యకర్తలు సర్వే చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరించడం వల్ల వారికి చికిత్స, మందులు అందించడం సులభం అవుతుంది. ఆశ కార్యకర్తలు సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వారందరికీ ఆధార్ తరహాలో ప్రత్యేకంగా నంబర్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం వేగంగా అందించేందుకు ఉపయోగపడుతుంది. ఏ గ్రామంలో ఎంత మంది, ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలుసుకునే వీలుంటుంది. ఏమైనా రుగ్మతులు ఉంటే దవాఖానకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్యం, మందులు అందించవచ్చు.