
పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన పల్లె దవాఖానలతో సత్ఫలితాలు రాగా.. ఈ తరహా సేవలను పట్టణాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రతి మున్సిపాలిటీలో బస్తీ వైద్యశాలలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో సర్కారు వైద్య సేవలు పట్టణ వాసులకు మరింత చేరువ కానున్నాయి. జిల్లా, ఏరియా దవాఖానలకు రోగులు, గర్భిణుల తాకిడి తగ్గనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బస్తీ దవాఖానలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ వచ్చే జూన్ 2నాటికి అన్ని మున్సిపాలిటీల పరిధిలో బస్తీ దవాఖానలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. దాంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో సంబంధిత శాఖ అధికారులు ప్రతిపాదనలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
పట్టణ ప్రజల ముంగిటకు సర్కారు వైద్య సేవలు
పల్లె ప్రజలకు సర్కారు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 21 పీహెచ్‌సీలు, మూడు సీహెచ్‌సీలు పల్లె ప్రజానీకానికి సేవలు అందిస్తుండగా.. పల్లె దవాఖానలతో వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. జిల్లాకు 47 వరకు పల్లె దవాఖానలు మంజూరు కాగా.. 18 దవాఖానలను అందుబాటులోకి తెచ్చారు. ప్రాథమిక స్థాయి వైద్యానికే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల హోదాను పెంచి పల్లె దవాఖానలుగా మార్చడంతోపాటు ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారిని వైద్యులుగా నియమించారు. ఈ కేంద్రాల పరిధిలో గతంలోనే ఇద్దరు ఏఎన్ఎంలు, జనాభాకు అనుగుణంగా ఆశ కార్యకర్తలు ఉండడంతో వారి ద్వారా సేవలు కొనసాగుతున్నాయి. గర్భిణులకు సేవలు, వివిధ వయస్సుల వారికి టీకాల పంపిణీ, ఆరోగ్య పరీక్షలు, విపత్కర పరిస్థితుల్లో, సీజనల్ వ్యాధులు ప్రబలే క్రమంలో ప్రథమ చికిత్స, కుటుంబ నియంత్రణ సేవలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఔషధాలను పంపిణీ చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం దగ్గరలోని పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్తున్నారు. పల్లె దవాఖానల తరహాలోనే బస్తీ దవాఖానలు సైతం ఏర్పాటవుతుండడంతో పట్టణ ప్రజల ముంగిటకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే.. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిపై భారం కూడా తగ్గనుంది. రోజూ ఏరియా ఆసుపత్రితోపాటు, జిల్లా కేంద్రంలోని అర్బన్ పీహెచ్‌సీల పరిధిలో 200 నుంచి 300 వరకు ఓపీ నమోదవుతుంది. సాధారణ జ్వరాలతోపాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకే వస్తుంటారు. రోగుల తాకిడితో వైద్య సేవలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో బస్తీ దవాఖానల ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రిపై భారం తగ్గనుంది.
20వేల లోపు జనాభాకు ఓ దవాఖాన
జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. 15 నుంచి 20వేలలోపు ఉన్న జనాభాకు ఒక బస్తీ దవాఖానను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలోని జనాభా ప్రకారం ఏడు నుంచి ఎనిమిది వరకు బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో జనాభా ఎక్కువగా ఉండడంతో వీటిల్లో రెండు చొప్పున ఏర్పాటు చేసే యోచన ఉంది. అయితే భువనగిరిలో ఇప్పటికే ఉన్న అర్బన్ పీహెచ్‌సీని బస్తీ దవాఖానగా మార్చే అవకాశం ఉంది.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది
బస్తీ దవాఖానల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఏడు నుంచి ఎనిమిది వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ దవాఖానలు అందుబాటులోకి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవల పరంగా మరింత మేలు కలుగుతుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే బస్తీ దవాఖానల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటాం.