
దుబ్బాక, డిసెంబర్ 24: దుబ్బాక అభివృద్ధి హారంలో ‘వంద పడకల దవాఖాన’ భవన సముదాయం మణిహారంగా మారనున్నది. దుబ్బాక ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని మమకారం. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేలందించే ఉద్దేశంతో రూ.20 కోట్లతో వంద పడకల దవాఖాన మంజూరు చేశారు. ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో దుబ్బాక పట్టణంలో సకల హంగులతో వంద పడకల దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. ఈ దవాఖాన కేవలం దుబ్బాక నియోజకవర్గ ప్రజలకే కాకుండా పక్క జిల్లాల (మెదక్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలు) సరిహద్దు గ్రామాల ప్రజలకు మెరుగైన వైద సేవలందనున్నాయి. ఇప్పటివరకు దుబ్బాకలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో నిత్యం వందలాది మందికి వైద్య సేవలందిస్తున్నారు. ప్రధానంగా ప్రసూతి వైద్య సేవలకు..‘దుబ్బాక దవాఖాన’ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. శనివారం వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా వంద పడకల ఆస్పత్రి ప్రారంభం చేయనున్న నేప థ్యంలో ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక కథనం..
రూ.20 కోట్లతో భవనం
గతంలో సర్కారు దవాఖాన అంటే …నేను రాను బిడ్డో అని భయపడేవారు. టీఆర్ఎస్ హయాంలో సర్కారు దవాఖానలకు ఆదరణ పెరిగింది. దీంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ దవాఖానలోనే వైద్యం చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు కారణం.. సర్కా రు దవాఖానలో మెరుగైన వసతులు, వైద్య సేవలందడమే. సర్కారు ఆస్పత్రు ల్లో పేద, మధ్య తరగతి ప్రజలే కాకుండా సంపన్నులు సైతం వైద్య సేవ లు పొందుతున్నారు. దుబ్బాక పట్టణం మూడు జిల్లాల సరిహద్దులో ఉంటుంది. దీంతో నిత్యం వందలాది మంది ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 30 బెడ్ల దవాఖాన ఉండగా..పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందకపోవడంతో …దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వంద పడకల ఆస్పత్రి మంజూరు చేయించారు. మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.18.5 కోట్ల్లతో దవాఖాన భవన నిర్మాణం పూర్తైంది.
కార్పొరేట్ తరహాలో..
కార్పొరేట్ దవాఖానల తరహాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, వసతులు అందించేందుకు దు బ్బాకలో వంద పడకల ఆస్పత్రిని నాలు గెకరాల స్థలంలో నిర్మించారు. రూ.18.5 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్లో 80,490 అడుగుల వైశాల్యంతో విశాలమైన 20 గదులు నిర్మించారు. మొదటి అంతస్తులో 35,560 అడుగుల వైశాల్యంతో ఇన్ పేషెంట్ గదులు, ఆపరేషన్ థియేటర్, సమావేశ మందిరం, గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఓపీ, ప్రసూతి విభా గం, చిన్న పిల్లల విభాగం, అత్యవసర సేవలు, నవజాత శిశు సేవలు, బ్లడ్ బ్యాంక్ విభాగం గదులు నిర్మించారు. మొదటి అంతస్తులో ఇన్ పేషెంట్ విభాగం, ఐసీయూ వార్డులు, ప్రత్యేక వైద్యసేవల విభాగం, అత్యవసర శాస్త్ర చికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్, ఈఎన్టీ, ఆర్థో, ఆప్తాల్ వార్డులు, వైద్య సిబ్బంది విశ్రాంత గదులు, సమావేశ మందిరం నిర్మించారు. దవాఖాన పక్కన వీఆర్‌సీసీ సంపు, వెనుక భాగంలో మార్చురీ గది, రోగుల బంధువులు బస చేసేందుకు విశ్రాంత భవనం నిర్మించారు. భవనానికి చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఇటీవల రూ.1.16 కోట్లు మంజూరయ్యాయి.
పేదలకు మెరుగైన వైద్య సేవలు
టీఆర్ఎస్ హయాంలోనే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దుబ్బాకపై సీఎం కేసీఆర్‌కు ఉన్న మమకారంతోనే వంద పడకల దవాఖాన భవనం మంజూరైంది. ఈ నెల 25న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వంద పడకల దవాఖాన భవనాన్ని ప్రారంభిస్తారు. దుబ్బాకతో పాటు పక్క జిల్లాల గ్రామాల ప్రజలకు దుబ్బాకలో నిర్మించిన వంద పడకల దవాఖానలో వైద్య సేవలు అందుతాయి. అత్యవసర వైద్య సేవల కోసం సిద్దిపేట, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం దుబ్బాకలో 30 పడకల దవాఖానను ఇందులోకి షిప్ట్ చేసి, దశలవారీగావంద పడకల ఆస్పత్రిలో పూర్తి స్థాయి సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. వంద పడకల దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ