శేరిలింగంపల్లి : సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్న రిసెర్చ్‌స్కాలర్ ఆత్మహత్యకు యత్నించాడు. పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సదరు విద్యార్ధిని స్థానికులు దవాఖానకు తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఈ విదంగా ఉన్నాయి.
వనపర్తి జిల్లా, ఖిలా ఘన్‌ఫూర్ మండలం, కమలుద్దీన్పూర్కు చెందిన వై.శివకుమార్ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఏంఎ సైతం సెంట్రల్ యూనివర్సిటీలోనే పూర్తిచేసుకున్న శివకుమార్ రిసెర్చ్ స్కాలర్‌గా కొనసాగుతూ యూనివర్సిటీలోని వసతిగృహాంలో నివసిస్తున్నాడు.
శుక్రవారం మద్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో గార్డెన్లో పిచికారిచేసే పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం గమనించిన తోటి విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం శివకుమార్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ శివకుమార్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు కారణంగా పోలీసులు వెల్లడించారు.
ప్రేమ వ్యవహారంలో ఓ యువతితో ఏర్పడిన వివాదాల కారణంగా మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.